ప్రజాస్వామ్య హక్కులకు న్యాయస్థానం అండ.
* కాంగ్రెస్ కుట్ర విఫలమైందన్న కేటీఆర్.
హైదరాబాద్, మహా.
బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సు’ కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బీఆర్ఎస్‌కు ఊరట లభించింది. శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేలా సరూర్‌నగర్ స్టేడియంలో జూలై 18న సదస్సు నిర్వహించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు తీర్పు అనంతరం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే. తారక రామారావు (కేటీఆర్) సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో స్పందించారు. “రేపు సరూర్‌నగర్ స్టేడియంలో జరగబోయే యువ సంగ్రామ సదస్సును అడ్డుకుని నిరుద్యోగ యువత గొంతు నొక్కాలని ప్రయత్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించినా, గౌరవ హైకోర్టు ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతూ సదస్సుకు అనుమతి ఇచ్చింది” అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువత తరఫున బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. “యువతీ యువకులారా.. పెద్ద ఎత్తున తరలిరండి. సరూర్‌నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల ముందుంచుదాం. ఎన్నికల హామీల అమలుకు జంగ్ సైరన్ మోగిద్దాం. రేపు ఉదయం 10 గంటలకు ఛలో సరూర్‌నగర్” అంటూ యువతకు పిలుపునిచ్చారు.
ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, యువత సంక్షేమానికి సంబంధించిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించింది. ఈ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా జూలై 18న సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు కూడా చేపట్టింది.
అయితే సదస్సుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది, నిఘా వర్గాల నివేదికల ప్రకారం సభ నిర్వహిస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, సభా ప్రాంగణంలో తగిన పార్కింగ్ సౌకర్యాలు కూడా లేవని కోర్టుకు వివరించారు.
ప్రభుత్వ వాదనలపై హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. సదస్సుకు సంబంధించిన దరఖాస్తు 17 రోజుల ముందే సమర్పించినప్పటికీ అప్పటి వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శాంతిభద్రతలు, పార్కింగ్ వంటి అభ్యంతరాలను ముందుగానే నిర్వాహకుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీసింది. అనంతరం అన్ని అంశాలను పరిశీలించిన ధర్మాసనం నిర్దిష్ట షరతులతో సభ నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేసింది.
హైకోర్టు అనుమతితో ఇప్పుడు బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు యువత సమస్యలు, ఎన్నికల హామీల అమలు అంశాలను ప్రభుత్వం ముందుంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుండగా, మరోవైపు ఈ సదస్సుకు అధికార కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.







