తెలంగాణ న్యాయవాదుల సంక్షేమంపై సీజేఐ ప్రశంసలు.
• రూ.100 కోట్ల వెల్ఫేర్ కార్పస్ ఫండ్ అభినందనీయం.
• మహిళా న్యాయవాదుల సౌకర్యాలపై నివేదిక కోరిన సుప్రీంకోర్టు.
హైదరాబాద్, మహా.
న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ప్రశంసించారు. న్యాయవాదుల సంక్షేమ నిధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో శాశ్వత కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అఫిడవిట్‌లో పేర్కొంది. కెనరా బ్యాంకులో రూ.100 కోట్ల శాశ్వత కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసి, దానిపై వచ్చే వడ్డీతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా 2022 నుంచి 2026 వరకు వెల్ఫేర్ ట్రస్ట్‌కు అదనంగా రూ.7 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించింది. ఈ నిధుల ద్వారా న్యాయవాదుల కుటుంబాలకు అవసరమైన వైద్య, ఆర్థిక భద్రతా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
రాష్ట్రంలో సుమారు 50 వేల మంది న్యాయవాదుల కుటుంబాలకు ఉచిత ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోందని అఫిడవిట్‌లో వివరించింది. ప్రతి న్యాయవాది కుటుంబానికి రూ.2 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే ప్రమాదవశాత్తు న్యాయవాది మరణించిన పక్షంలో వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోందని, న్యాయవాదుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందని ప్రభుత్వం అఫిడవిట్‌లో వెల్లడించింది.
విచారణ సందర్భంగా మహిళా న్యాయవాదుల సంక్షేమంపై కూడా సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. కోర్టు ప్రాంగణాల్లో మహిళా న్యాయవాదులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు, విశ్రాంతి గదులు, పారిశుద్ధ్య వసతులు, ఇతర సౌకర్యాలపై సమగ్ర సమీక్ష నిర్వహించి నివేదిక సమర్పించాలని అడ్వకేట్ జనరల్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. మహిళా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను సూచించాలని కూడా ధర్మాసనం పేర్కొంది.
రిట్ పిటిషన్ నంబర్ 770/2026 విచారణ సందర్భంగా తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శి బి. పాపిరెడ్డి ఈ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టులో సమర్పించారు. ఇందులో న్యాయవాదుల వైద్య అత్యవసర పరిస్థితులు, కుటుంబ భద్రత, ఆర్థిక సహాయం కోసం తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నిరంతరం సేవలందిస్తోందని ప్రభుత్వం వివరించింది. భవిష్యత్తులో న్యాయవాదుల సంక్షేమాన్ని మరింత విస్తరించేలా కొత్త పథకాలు తీసుకురావడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని కూడా అఫిడవిట్‌లో పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ చర్యలను సీజేఐ ప్రశంసించడం దేశవ్యాప్తంగా న్యాయవాదుల సంక్షేమంపై జరుగుతున్న చర్చలకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి సంక్షేమ నమూనాలను అమలు చేసే దిశగా ఆలోచించే అవకాశముందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






