పట్టణ పేదల సొంతింటి కలకు సర్కార్ ఊతం.
* ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి గ్రీన్‌సిగ్నల్.
హైదరాబాద్, మహా.
పట్టణ ప్రాంతాల్లోని పేదలు, అల్పాదాయ వర్గాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం’ అమలుకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు , అల్పాదాయ వర్గాలు కోసం సరసమైన ధరల్లో నాణ్యమైన 2 బిహెచ్కె ఇళ్ల నిర్మాణానికి ఈ మార్గదర్శకాలు దోహదపడనున్నాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పట్టణ ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో గృహాలను వేగంగా నిర్మించి లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పరిపాలనా ప్రక్రియలను మరింత సరళీకరించింది. గృహ నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల్లో జాప్యం లేకుండా ప్రత్యేక టీజీహెచ్‌బీ అఫోర్డబుల్ అర్బన్ హౌసింగ్ సింగిల్ విండో కమిటీ ని ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీ ద్వారా వివిధ శాఖల నుంచి అవసరమైన అనుమతులను ఒకే వేదికపై త్వరితగతిన మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు ‘బిల్డ్‌నౌ వర్క్‌ఫ్లో విధానాన్ని కూడా అమల్లోకి తీసుకురానుంది. ఈ విధానం ద్వారా దరఖాస్తుల పరిశీలన, సాంకేతిక అనుమతులు, నిర్మాణ అనుమతుల జారీ వంటి ప్రక్రియలు డిజిటల్ విధానంలో వేగంగా పూర్తికానున్నాయి. దీంతో గృహ నిర్మాణ ప్రాజెక్టులు నిర్దేశిత గడువులో పూర్తయ్యే అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ పథకంలో భాగంగా నిర్మించే ఇళ్లకు ప్రభుత్వం మరో కీలక రాయితీ ప్రకటించింది. ప్లానింగ్ అనుమతులు, బిల్డింగ్ పర్మిషన్ ఫీజులను పూర్తిగా మాఫీ చేసింది. ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద చేపట్టే ప్రాజెక్టులకు ఎలాంటి ప్లానింగ్ లేదా బిల్డింగ్ పర్మిషన్ చార్జీలు వసూలు చేయవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఈ మినహాయింపును అమలు చేసింది.
అనుమతుల ప్రక్రియను సరళీకరించడం, ఫీజులను మాఫీ చేయడం, సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా నిర్మాణ వ్యయాన్ని తగ్గించి, తక్కువ ధరల్లో నాణ్యమైన ఇళ్లను పట్టణ పేదలకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో గృహ నిర్మాణ పనులు వేగవంతం కావడంతో పాటు లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపులో జాప్యం కూడా తగ్గే అవకాశం ఉంది.
పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వేలాది నిరుపేద, అల్పాదాయ కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఊరట లభించనుంది. నాణ్యమైన గృహాలు, పారదర్శక అనుమతుల వ్యవస్థ, వేగవంతమైన నిర్మాణ ప్రక్రియతో ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం తెలంగాణలో పట్టణ గృహ రంగంలో కీలక మార్పులకు దారి తీసే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.







