Mahaa Daily Exclusive

  జప్తు ఆస్తుల విక్రయంపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు. ఏడేళ్లలోపు వేలం తప్పనిసరి.

Share

హైదరాబాద్, మహా.

రుణగ్రహీతలు అప్పులు చెల్లించకపోవడంతో బ్యాంకులు స్వాధీనం చేసుకునే స్థిరాస్తుల విక్రయంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు రికవరీ కోసం జప్తు చేసిన స్థిరాస్తులను గరిష్ఠంగా ఏడేళ్లలోపు బహిరంగ వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. బ్యాంకులు తమ సొంత కార్యకలాపాల కోసం వినియోగించే ఆస్తులు మినహా, రుణాల వసూళ్ల కోసం స్వాధీనం చేసుకున్న అన్ని ఆస్తులకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

స్వాధీనం చేసుకున్న ఆస్తుల నిర్వహణ, విక్రయ ప్రక్రియలో బ్యాంకులు తప్పనిసరిగా ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్‌ఐ (SARFAESI) చట్టం–2002లో పేర్కొన్న వేలం నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఇప్పటికే సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల వద్ద ఉన్న జప్తు ఆస్తులను విక్రయించేందుకు 2027 సెప్టెంబర్ 30 వరకు అదనపు గడువు కల్పించింది.

ఆస్తుల విక్రయంలో అక్రమాలకు తావులేకుండా ఆర్‌బీఐ మరో కీలక నిబంధనను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్సీ కోడ్ (ఐబీసీ) కింద డిఫాల్టర్లుగా గుర్తించిన రుణగ్రహీతలు లేదా వారికి సంబంధించిన వ్యక్తులు, సంస్థలకు ఈ జప్తు చేసిన ఆస్తులను తిరిగి విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించింది. దీంతో డిఫాల్టర్లు పరోక్షంగా తమ ఆస్తులను తిరిగి సొంతం చేసుకునే అవకాశానికి చెక్ పడనుంది.

అలాగే, ఆస్తి యాజమాన్య హక్కులు పూర్తిగా బ్యాంకు పేరుకు బదిలీ అయిన తర్వాతే దానిని స్వాధీనం చేసుకున్న ఆస్తిగా పరిగణించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అకౌంటింగ్‌లో పారదర్శకత కోసం, ఆస్తి మార్కెట్ విలువ అసలు విలువ కంటే తగ్గితే అదే తక్కువ మార్కెట్ విలువను బ్యాంకులు తమ లెక్కల్లో నమోదు చేయాల్సి ఉంటుంది.

జప్తు చేసిన ఈ ఆస్తులను సాధారణ స్థూల (గ్రాస్) లేదా నికర (నెట్) నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) లెక్కల్లో చూపకుండా, బ్యాలెన్స్ షీట్‌లో “క్లెయిమ్‌ల సంతృప్తి కోసం స్వాధీనం చేసుకున్న బ్యాంకింగేతర ఆస్తులు” అనే ప్రత్యేక శీర్షిక కింద విడిగా వెల్లడించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ మార్గదర్శకాలతో బ్యాంకుల ఆస్తుల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు, జప్తు ఆస్తుల విక్రయ ప్రక్రియ మరింత వేగవంతం కానుందని బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.