హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ వద్ద నిర్వహిస్తున్న అన్ని తరగతులకు సంబంధించిన ట్యూషన్ ఫీజుల వివరాలను తప్పనిసరిగా పాఠశాల వెబ్‌సైట్‌తో పాటు నోటీసు బోర్డుపై కూడా ప్రదర్శించాలని ఆదేశించింది. తల్లిదండ్రులకు ఫీజుల విషయంలో పూర్తి పారదర్శకత కల్పించడంతో పాటు యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా నియంత్రించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఫీజుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు సరైన సమాచారం అందేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా, ఈ నిర్ణయం అందులో కీలక అడుగుగా భావిస్తున్నారు. నిబంధనల అమలును విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు.
ఫీజు వివరాలతో పాటు 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన వార్షిక పరిపాలనా నివేదికలు, చార్టర్డ్ అకౌంటెంట్ ధృవీకరించిన ఆడిట్ నివేదికలను ఈ నెల 30లోగా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 1994 జీవో నం.1 ప్రకారం ప్రతి పాఠశాల ఈ నివేదికలను సమర్పించడం తప్పనిసరి అయినప్పటికీ, గతంలో దీనిని పాటించని యాజమాన్యాలపై ఇప్పుడు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గడువులోగా నివేదికలు సమర్పించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించనున్నారు. పాఠశాలల ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే ఈ చర్యల లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2027–28 విద్యా సంవత్సరం నాటికి ఫీజు నియంత్రణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గతంలో రెండేళ్లకు ఒకసారి గరిష్ఠంగా 8 శాతం మాత్రమే ఫీజులు పెంచేలా ముసాయిదా బిల్లును సిద్ధం చేసిన ప్రభుత్వం, ప్రజల అభిప్రాయాలను సేకరించిన అనంతరం తుది రూపమివ్వాలని భావిస్తోంది.
ప్రస్తుతం పాఠశాలల ఫీజు నిర్మాణం, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్న ప్రభుత్వం, వాటిపై మంత్రివర్గంలో చర్చించి త్వరలోనే శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై స్పష్టమైన నియంత్రణ ఏర్పడి, తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.








