Mahaa Daily Exclusive

  అవినీతి అరికడితే ఉచిత కార్పొరేట్ విద్య, వైద్యం సాధ్యం.

Share

• టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత.

హైదరాబాద్, మహా.

అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేస్తే తెలంగాణ ప్రజలకు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని అందించడం సాధ్యమేనని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ ప్రకటించిన ‘పాంచజన్యం’లోని కీలక పథకాలైన ఉచిత కార్పొరేట్ విద్య, వైద్యం గురించి ప్రస్తావించగానే ఇతర రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. దీనిపై సుదీర్ఘ అధ్యయనం, ఆర్థిక విశ్లేషణ అనంతరమే తాము ఈ నిర్ణయానికి వచ్చామని, దీనికి అయ్యే ఖర్చు, దానికి అవసరమైన ఆదాయ వనరులపై తమ వద్ద పూర్తి లెక్కలు ఉన్నాయని తెలిపారు.

జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో మాట్లాడిన కవిత, తాను అధికారంలోకి వస్తే అవినీతికి తావుండదని, ప్రస్తుతం అవినీతి రూపంలో వృథా అవుతున్న నిధులను ప్రజా సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ప్రజల సొమ్మును సక్రమంగా వినియోగిస్తే కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యం అందించడం కష్టమేమీ కాదన్నారు.

బీఆర్ఎస్‌లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే తనను పార్టీ నుంచి బహిష్కరించారని కవిత ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీసినందుకు, బీసీల హక్కులు, అవినీతి అంశాలపై మాట్లాడటం ప్రారంభించిన తర్వాత తనపై కుట్రలు జరిగాయని పేర్కొన్నారు. కొందరు నాయకులు కలిసి తనను రాజకీయంగా ఏకాకిని చేయాలని ప్రయత్నించారని విమర్శించారు.

ప్రజాసేవలో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న తాను మరింత సమర్థవంతంగా సేవలందించాలనే ఉద్దేశంతో కొత్త పార్టీని స్థాపించానని కవిత తెలిపారు. మేధావుల సూచనలు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ‘పాంచజన్యం’ పేరుతో ఐదు ప్రధాన పథకాలను రూపొందించినట్లు చెప్పారు. వీటిలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం, యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయని వెల్లడించారు.

యువతకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచస్థాయి సంస్థలను స్థాపించే పారిశ్రామికవేత్తలు తెలంగాణ నుంచి తయారయ్యేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి నీటి ప్రాజెక్టులపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయని, మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండానే నీటిని ఎత్తిపోయవచ్చని అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కారణంగా భద్రాచలం మునిగిపోతుందంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఏ సమస్యను ప్రస్తావించినా ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎదురుదాడులకు దిగుతోందని కవిత ఆరోపించారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాలంటే టీఆర్ఎస్‌ను ఆశీర్వదించాలని ఆమె కోరారు.