ఢిల్లీ, మహా.
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు జరిపిందని ఇరాన్ ఆరోపించింది. అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించిన ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ, అమెరికాను “క్రిమినల్ దేశం”, “గ్రేట్ సాతాన్” అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఈ దాడి అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని ఇరాన్ పేర్కొంది.
తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన లక్షలాది మంది ప్రజలకు మొజ్తబా ఖమేనీ ప్రత్యేక సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భారీ స్పందన ఇరాన్ ఐక్యతకు నిదర్శనమని, విదేశీ ఒత్తిళ్లను ఎదుర్కొనే సంకల్పాన్ని ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసే శక్తి ఇరాన్‌కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల జోర్డాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న బలగాల దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అమెరికా ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, ఐఆర్‌జీసీకి సంబంధించిన సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించింది.
ఈ ప్రతిదాడుల సందర్భంగా నిర్మాణంలో ఉన్న డార్ఖోవిన్ అణు విద్యుత్ కేంద్రం కూడా లక్ష్యంగా మారిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే ఆ కేంద్రంలో అప్పటివరకు అణు పదార్థాలు లేవని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ ఆరోపణలపై అమెరికా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
మధ్యప్రాచ్యంలో వేగంగా మారుతున్న ఈ పరిణామాలతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్ ఆరోపణలకు అమెరికా స్పందన, అంతర్జాతీయ సమాజం వైఖరి, తదుపరి దౌత్యపరమైన పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.








