హైదరాబాద్, మహా.
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లోని ఓ పౌల్ట్రీ ఫారంపై ఈగల్ ఫోర్స్, నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. ఈ దాడుల్లో కిలోకు పైగా అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 35 మందిని నిందితులుగా గుర్తించగా, వారిలో 12 మందిని అరెస్టు చేశారు. మిగిలిన 23 మంది పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 20/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో ఈ కేసు ప్రధాన నిందితుడిగా మలేలా జయప్రకాశ్ గౌడ్‌ను ఈగల్ ఫోర్స్ గుర్తించింది. ఇదే తరహా కేసులో అతడు 2025లో అరెస్టై ఆరు నెలల జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడని, అనంతరం మళ్లీ అక్రమంగా డ్రగ్స్ తయారీ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరో కీలక నిందితుడిగా కృష్ణయ్య గౌడ్‌ను గుర్తించినట్లు, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. అతడు పలుమార్లు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు కూడా వెల్లడించారు.
ప్రాథమిక దర్యాప్తులో నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం, తాటి కల్లులో కల్తీ చేసేందుకు ఉపయోగించే ఉద్దేశంతో ఈ అల్ప్రాజోలంను తయారు చేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ తెలిపింది. పౌల్ట్రీ ఫారంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ తయారీ యూనిట్‌ను అధికారులు పూర్తిగా ధ్వంసం చేశారు.
పరారీలో ఉన్న నిందితుల్లో డ్రగ్స్ తయారీకి అవసరమైన రసాయనాలను సరఫరా చేసిన వ్యాపారులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జీడిమెట్ల, ప్రశాంత్‌నగర్, ఫతేనగర్, బాలానగర్ ప్రాంతాల నుంచి ఈ రసాయనాలు సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు. డ్రగ్స్ తయారీకి అవసరమైన రసాయనాలను సరఫరా చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఫోర్స్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. అలాగే డ్రగ్స్ తయారీ, సరఫరా నెట్‌వర్క్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసే దిశగా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.








