సిద్దిపేట, మహా.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గోదావరి నదిలో వస్తున్న నీటిని వినియోగించకుండా దిగువకు వదిలేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధిపేటలో బీఆర్ఎస్ నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ప్రతి చుక్కను వినియోగించుకుంటుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేయడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. రైతులకు సాగునీరు ఇవ్వాలని కోరితే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
“కేసీఆర్‌ను తిడితే నీళ్లు రావు.. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తేనే రైతులకు నీళ్లు వస్తాయి” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు చేశారు. రాజకీయాల కోసం లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టవద్దని ప్రభుత్వానికి సూచించారు. సాగునీరు అందకపోతే విద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో వర్షాభావం, సాగునీటి సమస్యలతో తలెత్తే తీవ్ర పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హరీశ్‌రావు హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడొద్దని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
భద్రాచలం మునిగిపోతుందంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని హరీశ్‌రావు అన్నారు. రైతులకు నీరు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపి, అందుబాటులో ఉన్న నీటిని వ్యవసాయానికి వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతతో రాష్ట్రంలో సుమారు 60 శాతం వ్యవసాయ భూములకు సాగునీరు అందించే అవకాశం ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులకు నీరు అందించే వరకు ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని, ఈ విషయంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.








