కరీంనగర్, మహా.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన నిరుద్యోగ నిరసనల వ్యాఖ్యలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఘాటుగా స్పందించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, నిరుద్యోగ యువతను రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో గ్రూప్-1 పరీక్షలను ఎందుకు సక్రమంగా నిర్వహించలేకపోయారో కేటీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడినందుకు ముందుగా బీఆర్‌ఎస్ నాయకులే యువతకు క్షమాపణ చెప్పాలని మంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతమైందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు.
“మీ పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా?” అంటూ కేటీఆర్‌ను శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఉద్యోగ నియామకాల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ నిరుద్యోగ యువత ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్షాల రాజకీయ ఎత్తుగడలకు యువత బలికావద్దని, తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని సూచించారు. రాష్ట్రంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు కొనసాగుతున్నాయని, అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.








