Mahaa Daily Exclusive

  ‘చలో సంసద్’ యాత్రకు అనుమతి లేదు.

Share

  •  ఢిల్లీ పోలీసుల స్పష్టీకరణ.
  •  నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు.

ఢిల్లీ, మహా.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపాదిత ‘చలో సంసద్’ యాత్రకు అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ యాత్ర నిర్వహణకు సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతి కోరలేదని, అందువల్ల అనుమతి కూడా మంజూరు చేయలేదని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. న్యూఢిల్లీ జిల్లాలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 163 అమల్లో ఉందని, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం, ర్యాలీలు, ఊరేగింపులు, నిరసనలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. అయితే, ముందస్తు అనుమతితో జంతర్‌మంతర్‌లో మాత్రమే నిరసనలు చేపట్టవచ్చని పేర్కొన్నారు.

జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ రాజధానిలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించే వారిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223తో పాటు ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు చట్టాన్ని గౌరవించాలని, అనధికారిక ర్యాలీలు లేదా గుమికూడే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే ఢిల్లీ నగరంలోని కీలక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ పరిసరాలు, జంతర్‌మంతర్, పార్లమెంట్ స్ట్రీట్, సెంట్రల్ విస్టా, శంకర్ చౌక్, కన్నాట్ ప్లేస్ ప్రాంతాల్లో అదనపు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల తనిఖీలు, పికెట్లు, అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

ఇదిలా ఉండగా, జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను శనివారం పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. జులై 20న నిర్వహించనున్న ‘చలో సంసద్’ యాత్రను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

మరోవైపు, యాత్రను యథావిధిగా నిర్వహిస్తామని కాక్రోజ్ జనతా పార్టీ ప్రకటించింది. జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు ఆ పార్టీ నాయకత్వం వెల్లడించింది. అయితే, పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా భద్రతా కారణాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండగా, యాత్ర నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది.