Mahaa Daily Exclusive

  ‘ఇక భయాలు లేవు.. నా గొంతుకను నేనే ఎంచుకుంటా’.

Share

  •  అనుపమ భావోద్వేగ పోస్ట్ వైరల్.

హైదరాబాద్ , మహా.

ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని, ఇకపై ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని, భయాలకు తావు లేదని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. “నా గొంతుకను నేనే ఎంచుకుంటా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంగా స్పందించిన అనుపమ.. “కొన్నిసార్లు ప్రశాంతతను పొందాలంటే కొన్ని విషయాలను వదులుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు నాకు ఆ ప్రశాంతత దొరికింది. ఇకపై నా గొంతుకను, నా జీవితాన్ని నేనే ఎంచుకుంటాను. ఇక అనుమతులు లేవు.. భయాలు లేవు. నన్ను నేను తిరిగి కనుగొంటూ నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను” అని రాసుకొచ్చారు. చాలా కాలంగా చెప్పాలనుకున్న విషయాన్ని ఇప్పుడు చెబుతున్నానని, ఇంతకాలం అది చెప్పేందుకు తనకు అవకాశం లేకపోయిందని కూడా పేర్కొన్నారు.

ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ అనుపమ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు పంపిన ప్రతి సందేశం, ప్రతి ప్రార్థన తనకు అత్యంత క్లిష్ట సమయంలో బలాన్నిచ్చాయని పేర్కొన్నారు. తనను తిరిగి తన దగ్గరకు చేర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, స్వేచ్ఛను, తన నిజమైన జీవితాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తున్నానని తన సందేశాన్ని ముగించారు.

ఇదిలా ఉండగా, అనుపమ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోగి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె కందుల సులోచన రాణి అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనున్నారు. ప్రకృతితో మమేకమై, బలమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలో ఆమె నటిస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. ఈ చిత్రంలో శర్వానంద్ ‘గంగ’ పాత్రలో నటిస్తుండగా, ఈ జంటను తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.