- హైదరాబాద్ లో ఢిల్లీ ప్రకంపనలు
- నాంపల్లి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
- రణ రంగాన్ని తలపించిన నాంపల్లి పరిసర ప్రాంతాలు
- గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ యత్నం
- బీజేపీ కార్యాలయంవైపు దూసుకొచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
- పరస్పరం రాళ్ళు, కర్రలతో దాడులు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలను అరెస్టు చేసిన పోలీసులు
- పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర పెనుగులాట
హైదరాబాద్, మహా : మంగళవారం ఢిల్లీలో జరిగిన పరిణామాలు బుధవారం హైదరాబాద్ ను అట్టుడికించింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ చలో లోక్ భవన్ చేపట్టింది. ఇందుకు ప్రతిగా గాంధీభవన్ ముట్టడికి బీజేపీ పిలుపు ఇచ్చింది. దీమతో నాంపల్లిలోని గాంధీ భవన్ పరిసర ప్రాంతాలు రణ రంగాన్ని తలపించాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయాందోళనలో ప్రధాన రహదారిపై వెళ్ళే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం ఢిల్లీలో ప్రధాని ఇంటి ముట్డికి కాంగ్రెస్ అగ్రనేతలు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకుని రాహుల్, ప్రియాంకలతో పాటు పలువురిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించడం, ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీకి స్వల్ప గాయం కావడం కాంగ్రెస్ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. ఢిల్లీ పోలీసుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ లోక్ భవన్ ముట్టడితో పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు నిచ్చింది.
కాంగ్రెస్ ఆందోళనలకు ప్రతిగా బీజేపీ కూడా ఆందోళనలకు సన్నద్దమైంది. గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ నేతలు రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ భవన్ వైపు దూసుకువచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ నేతలు పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. నేతల అరెస్టుల సందర్భంగా పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొంత మంది బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ వద్దకు వస్తుండగా గాంధీ భవన్ లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. అటు బీజేపీ, ఇటు కాంగ్స్ కార్యకర్తలు పరస్పరం రాళ్ళు రువ్వుకున్నారు. మరికొంత మంది కార్యకర్తలు కర్రలతో రెచ్చిపోయి దాడులకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు పార్టీల కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అంతే కాకుండా దాడులకు తెగబడ్డ కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పారు. అయినప్పటికీ పోలీసు వ్యాన్ పైకి ఎక్కిన పార్టీల కార్యకర్తలు దాడులకు దిగడంతో ప్రధాన రహదారిపై ఏం జరుగుతుందో తెలియక దారిన వెళ్ళే వారు భయాందోళనకు గురయ్యారు. బీజేపీ నాయకుల అరెస్టుపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ నేతలు, ప్రధాన మంత్రి కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో నాంపల్లి పరిసర ప్రాంతాలలో దాదాపు రెండు గంటల పాటు భయానక వాతావరణం ఏర్పడింది. పోలీసులు చాలా సేపు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకు రావాల్సి వచ్చింది.
ఎక్కడా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా పోలీసులు నాంపల్లి పరిసర ప్రాంతాలతో పాటు గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే నాంపల్లి పరిసర ప్రాంతాలలో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తతెత్తాయి. ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వరకు పోలీసులు అడుగడుగునా మోహరించి పహారా కాశారు. కొన్ని సందర్భాలలో వాహనాలను దారి మళ్ళించి ట్రాఫిక్ ను నియంత్రించారు.








