అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.
* భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.
* 770కుపైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.
ముంబయి, మహా.
అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా సుంకాలపై నెలకొన్న ఆందోళనల ప్రభావంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ముఖ్యంగా ఫార్మా, బ్యాంకింగ్, మిడ్‌క్యాప్ షేర్లలో విక్రయాలు అధికంగా నమోదయ్యాయి.
గత సెషన్లో 77,470 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ బుధవారం స్వల్ప నష్టంతో ప్రారంభమైనప్పటికీ, అనంతరం అమ్మకాల ఒత్తిడి పెరగడంతో 77 వేల మార్కు దిగువకు జారిపోయింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి సెన్సెక్స్ 771 పాయింట్లు కోల్పోయి 76,695 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా అదే ధోరణిని కొనసాగిస్తూ 208 పాయింట్ల నష్టంతో 23,978 వద్ద కొనసాగింది. దీంతో చాలా రోజుల తర్వాత నిఫ్టీ 24 వేల స్థాయి దిగువకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు సుమారు 4 శాతం పెరిగి 94.72 డాలర్ల వద్ద ట్రేడవుతుండటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన సుంకాలపై నెలకొన్న ఆందోళనలతో ఫార్మా రంగంలో అమ్మకాల ఒత్తిడి పెరగడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.53 వద్ద కొనసాగుతోంది.
రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్, ఫార్మా, మిడ్‌క్యాప్ సూచీలు అధిక ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 791 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 657 పాయింట్ల నష్టంతో ట్రేడైంది.
వ్యక్తిగత షేర్లలో కల్యాణ్ జువెల్లర్స్, బజాజ్ ఆటో, నెస్ట్లే ఇండియా, టీవీఎస్ మోటార్, పాలీక్యాబ్ షేర్లు లాభాల్లో కొనసాగగా, బంధన్ బ్యాంక్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, లూపిన్, వోల్టాస్, ఒరాకిల్ ఫిన్సెర్వ్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి.







