Mahaa Daily Exclusive

  16 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న లలిత్ మోదీ…

Share

16 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న లలిత్ మోదీ.
* ఫెమా కేసులో ట్రైబ్యూనల్ ఊరట.
* ఏడాది చివర్లో స్వదేశానికి వస్తానన్న మాజీ ఐపీఎల్ చైర్మన్.
ఢిల్లీ, మహా.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ భారత్‌కు తిరిగి వచ్చే సంకేతాలు ఇచ్చారు. 2009 ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద నమోదైన కేసులో అప్పిలేట్ ట్రైబ్యూనల్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో, 16 ఏళ్ల న్యాయ పోరాటానికి ముగింపు పలికిందని లలిత్ మోదీ ప్రకటించారు. ఈ తీర్పు అనంతరం విడుదల చేసిన వీడియోలో ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌కు తిరిగి వస్తానని వెల్లడించారు.

ట్రైబ్యూనల్ తీర్పుతో ఎంతో సంతోషంగా ఉందని, గత 16 ఏళ్లుగా తాను చెప్పిన వాదనలే నిజమని ఇప్పుడు న్యాయస్థానం నిర్ధారించిందని లలిత్ మోదీ పేర్కొన్నారు. ఐపీఎల్ ప్రయోజనాల కోసమే తాను పనిచేశానని, ఇప్పుడు ఆ అధ్యాయం ముగిసిందని చెప్పారు. జీవితంలో కొత్త దశను ప్రారంభించేందుకు స్వదేశానికి రావాలని ఎదురుచూస్తున్నానని తెలిపారు. అక్టోబర్‌లో తన కుమార్తెకు సంతానం జన్మించబోతోందని, కుటుంబంతో కలిసి భారత్‌లో ఉండాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కేసు 2009లో జరిగిన ఐపీఎల్ సీజన్‌తో ముడిపడి ఉంది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆ ఏడాది ఐపీఎల్ టోర్నీని భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు తరలించారు. టోర్నీ నిర్వహణ కోసం విదేశాలకు నిధులు బదిలీ చేసే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారంటూ లలిత్ మోదీతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసి, ఆయనపై రూ.10.65 కోట్ల జరిమానా విధించింది.

తాజాగా ఈ వ్యవహారాన్ని పరిశీలించిన అప్పిలేట్ ట్రైబ్యూనల్, ఈడీ విధించిన చర్యలను సమీక్షించి లలిత్ మోదీకి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఆయనపై కొనసాగుతున్న ప్రధాన న్యాయ వివాదానికి ముగింపు లభించినట్లైంది. దాదాపు 2010 నుంచి విదేశాల్లో నివసిస్తున్న లలిత్ మోదీ, ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడం క్రీడా, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.