11వ తరగతిలోనే చదువు మానేసి సైబర్ నేరాల బాట.
* ఏఐతో నకిలీ బ్యాంకింగ్ యాప్‌ల తయారీ.
* కాన్పూర్ యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు
కాన్పూర్,మహా.
11వ తరగతిలోనే చదువు మానేసిన ఓ యువకుడు డబ్బు కోసం సైబర్ నేరాల వైపు అడుగులు వేసి చివరకు పోలీసులకు చిక్కాడు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నకిలీ బ్యాంకింగ్ అప్లికేషన్లు, మాల్వేర్ ఉన్న ఏపీకే ఫైళ్లను తయారు చేసి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తూ భారీ మోసాలకు సహకరించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన రోహిత్ వీరేంద్ర సింగ్ శక్యను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, రోహిత్ 11వ తరగతి చదువుతున్న సమయంలోనే విద్యను మధ్యలోనే నిలిపివేశాడు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో సైబర్ నేరగాళ్లతో సంబంధాలు పెంచుకుని, వారికి అవసరమైన నకిలీ బ్యాంకింగ్ యాప్‌లు, మాల్వేర్ ఉన్న ఏపీకే ఫైళ్లను ఏఐ సాయంతో రూపొందించి అందించడం ప్రారంభించాడు. జార్ఖండ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సైబర్ ముఠాలు అతడి నుంచి ఈ యాప్‌లను కొనుగోలు చేసి అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ ఏడాది మే నెలలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా వచ్చిన బ్యాంకింగ్ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడంతో, అందులోని మాల్వేర్ కారణంగా అతని బ్యాంకు ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు అక్రమంగా బదిలీ అయింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో విచారణ చేపట్టగా, ఈ మోసం వెనుక రోహిత్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు, ఐటీ అధికారుల సంయుక్త బృందం కాన్పూర్‌లోని ఓ హోటల్‌పై దాడి నిర్వహించి రోహిత్‌ను అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించింది.
విచారణలో రోహిత్ కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఒక నకిలీ యాప్‌ను అభివృద్ధి చేయడానికి రూ.15 వేల వరకు, ఆ యాప్ నిర్వహణ, సాంకేతిక సేవల కోసం నెలకు మరో రూ.15 వేల వరకు వసూలు చేసేవాడని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్న ఇతర నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.







