Mahaa Daily Exclusive

  టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సస్పెన్షన్…

Share

టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సస్పెన్షన్.
• మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.
• వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు లోక్‌సభ నుంచి బహిష్కరణ.
ఢిల్లీ, మహా.
మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లోక్‌సభ సభ్యుడు కల్యాణ్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు ఆయనను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

బుధవారం మధ్యాహ్నం ప్రతిపక్షాల నిరసనల కారణంగా సభ వాయిదా పడిన అనంతరం, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి మాజీ టీఎంసీ సభ్యులు కకోలి ఘోష్ దస్తీదార్, శతాబ్ది రాయ్, మితాలి బాగ్‌లతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా తమను ఉద్దేశించి కల్యాణ్ బెనర్జీ అసభ్యకరమైన భాష ఉపయోగించారని, అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆ ముగ్గురు మహిళా ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.

మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రిసైడింగ్ అధికారి కృష్ణ ప్రసాద్ తెన్నేటి ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. మహిళా సభ్యుల ఫిర్యాదును ప్రస్తావిస్తూ, సభ గౌరవానికి భంగం కలిగించేలా సభ్యుడు ప్రవర్తించారనే అభిప్రాయాన్ని వెల్లడించారు. అనంతరం కల్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేయాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.

దీంతో ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు కల్యాణ్ బెనర్జీ లోక్‌సభ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు. మహిళా సభ్యుల పట్ల అనుచిత ప్రవర్తనపై సభ కఠిన వైఖరి అవలంబించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.