Mahaa Daily Exclusive

  రైతులకు కేంద్రం శుభవార్త..

Share

  • రైతులకు కేంద్రం శుభవార్త
  • తెలంగాణ నుంచి అదనంగా ధాన్యం కొనుగోళ్లు
  • కేంద్రం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ, మహా : తెలంగాణలోని వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రైతులకు ఎంతో మేలు చేకూర్చే ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఊరట లభించనుంది. సవరించిన అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ధాన్యం సేకరణ కోటాను గణనీయంగా పెంచింది. కొత్తగా పెంచిన పరిమాణం వలన ధాన్యం కొనుగోలు కోటా 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. 8 లక్షల మెట్రిక్ టన్నులను తెలంగాణ నుంచి అదనంగా సేకరించనుంది. ఈ నిర్ణయంతో రబీ ధాన్యాన్ని విక్రయించేందుకు నిరీక్షిస్తున్న వేలాది మంది రైతులకు కనీస మద్దతు ధర లభించనుంది.

తొలుత కేంద్రం 35 లక్షల మెట్రిక్ టన్నుల పరిమితిని విధించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రావడం, రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రక్రియ వేగవంతం కావడంలో తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు కీలక పాత్ర పోషించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పలుమార్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. రబీ పంట సేకరణ పరిమితిని పెంచాలని ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు.

కోటా పెంపునకు గ్రీన్ సిగ్నల్ రావడంతో, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కొద్ది నెలలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కొరత, గన్నీ బ్యాగుల కొరత, వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోవడం వంటి సమస్యలపై తీవ్ర చర్చ జరిగింది. రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని బృందం కూడా ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇప్పుడు అదనపు ధాన్యం కొనుగోలుకు అంగీకరించడంతో రైతుల వద్ద పేరుకుపోయిన నిల్వల సేకరణ శరవేగంగా పూర్తవుతుందని ఆశిస్తున్నారు.