Mahaa Daily Exclusive

  గత పాల‌న‌లో ప్ర‌జ‌ల గోడు వినేవారే లేరు…

Share

  • గత పాల‌న‌లో ప్ర‌జ‌ల గోడు వినేవారే లేరు
  • ప్ర‌తివారం గాంధీభ‌వ‌న్‌లో ప్ర‌జ‌ల‌తో మంత్రుల ముఖాముఖి
  • క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్ల కోసం మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
  • 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం
  • ప్ర‌ధాని మోదీ, విద్యామంత్రి ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి
  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్, మహా : ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో పాల‌కుల‌కు ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవ‌డానికి అవ‌కాశం ఉండేదికాద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. మంత్రుల కూడా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేవారుకాద‌న్నారు. బుధ‌వారం గాంధీభ‌వ‌న్‌లో ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి ప్ర‌జ‌ల నుంచి విన‌తి ప‌త్రాల‌ను స్వీక‌రించారు. కొన్ని స‌మ‌స్య‌ల‌పై అక్క‌డిక‌క్క‌డే క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. అనంత‌రం గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ తమ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు ప్ర‌తివారం క్యాబినెట్‌లో ఒక మంత్రి ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి నిర్వ‌హిస్తు వీలైనంత‌వ‌ర‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నామ‌న్నారు. నేటి ముఖాముఖిలో చాలా వ‌ర‌కు ఇండ్ల గురించి ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌న్నారు.

ఈ ప్ర‌భుత్వంలోనే త‌మ సొంతింటి క‌ల నెర‌వేతుంద‌నే ఆశతో ప్ర‌జ‌లు ఉన్నారని, వారి ఆశ‌ల‌కు అనుగుణంగా త‌మ ప్ర‌భుత్వం మొద‌టి విడ‌త‌లో 4.50 ల‌క్ష‌లు, రెండో విడ‌త‌లో 2.50 ల‌క్ష‌లు మొత్తం 7 ల‌క్ష‌ల ఇండ్ల‌ను మంజూరు చేసింద‌న్నారు. గ‌డ‌చిన ప‌దేళ్ళలో ఆనాటి ప్ర‌భుత్వం పేద‌ల‌కు అర‌కొర‌గా న‌గ‌రానికి 30-40 కిలోమీట‌ర్ల దూరంలో ఇండ్లు నిర్మించింద‌ని, ఫ‌లితంగా త‌మ జీవ‌నోపాధి దెబ్బ‌తింటుంద‌న్న ఆందోళ‌న‌తో పేద‌లు ఆ ఇళ్ల‌ల్లో అడుగుకూడా పెట్ట‌లేద‌న్నారు. ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా పేద‌వాడు పుట్టి పెరిగిన చోటే నివాసం క‌ల్పించాల‌న్న సంకల్పంతో నియోజ‌క‌వ‌ర్గాన్ని యూనిట్‌గా తీసుకొని ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్పుడు నిర్మించ‌బోయే ఇండ్ల విలువ 40 నుంచి కోటి రూపాయిల వ‌ర‌కు ఉంటుంద‌ని
ఇంటిస్ద‌లంలో వాటా కూడా క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. పైల‌ట్ ప్రాజెక్ట్‌గా 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇందిరమ్మ ట‌వ‌ర్స్ నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. గ‌తంలో ఇందిర‌మ్మ ఇండ్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారు ఈ ఇండ్ల కోసం మీ సేవ, వాట్సాప్‌, వెబ్‌సైట్ ద్వారా మ‌రో సారి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. భూముల‌కు సంబంధించిన వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో ప‌రిష్కరించ‌గ‌ల‌గిన అన్నింటికీ పరిష్కారం చూపిస్తామ‌న్నారు.

దేశంలో యువ‌త‌ను దెబ్బ‌తీసిన నీట్ ప‌రీక్ష లీకేజీపై శాంతియుతంగా ఢిల్లీలో ధ‌ర్నా చేస్తున్న యువ‌త‌పైన‌, మ‌ద్ద‌తు తెలిపిన కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు మ‌ల్లిఖార్జ‌న్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీల‌పై లాఠీఛార్జి చేయ‌డం కేంద్ర ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని మంత్రి పొంగులేటి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌తిప‌క్షాల‌కు స‌మాధానం చెప్ప‌లేక పార్ల‌మెంటును ప‌లుమార్లు వాయిదా వేయ‌డం, స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం ప్ర‌భుత్వ చేత‌కానిత‌నాన్ని ఎత్తిచూపుతుంద‌న్నారు. త‌క్ష‌ణ‌మే ప్ర‌ధాని మోదీ, మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఎఐసిసి పిలుపు మేర‌కు ఈరోజు హైద‌రాబాద్‌లో ర్యాలీ నిర్వ‌హించామ‌ని, నీట్ ప‌రీక్ష రాసిన 22 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్దుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుందన్నారు.