ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసు.
* హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా.
హైదరాబాద్, మహా.
నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం, అప్పటి వరకు పిటిషనర్‌పై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించాలని ఆయన తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని అంగీకరించలేదు.
తనపై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని, చట్టపరమైన విధానాలను పాటించకుండా పోలీసులు వ్యవహరించారని పేర్కొంటూ ఉదయ్‌కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో ఫిర్యాదుదారుతో గతంలో ప్రేమ సంబంధం ఉన్నట్లు, ఇద్దరూ వివాహం చేసుకోవాలని భావించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆమె మరో ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకున్నారని, ఆ తర్వాత కూడా తిరిగి అనుబంధాన్ని కొనసాగించాలని తనను సంప్రదించారని ఆయన వాదించారు. అకాడమీ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల్లో పరస్పర విరుద్ధమైన అంశాలు ఉన్నాయని, సరైన విచారణ లేకుండానే కేసు నమోదు చేశారని పిటిషన్‌లో వివరించారు.
ఇదిలా ఉండగా, ఈ కేసు దర్యాప్తును ఉన్నతాధికారులు మహిళా భద్రతా విభాగానికి అప్పగించారు. షీ టీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తును కొనసాగించనున్నట్లు సమాచారం. కేసులో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ సాక్ష్యాధారాల సేకరణపై అధికారులు దృష్టి సారించారు.
కేసు నమోదైన అనంతరం ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారంతో ఆస్పత్రిలో చేరిన ఉదయ్‌కృష్ణారెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. వైద్య పరీక్షల్లో ఆయన ఎలాంటి విషపదార్థం తీసుకోలేదని తేలడంతో కేసు దర్యాప్తు మరో కీలక మలుపు తిరిగింది. ఆయన పేరుతో లభించిన సూసైడ్ నోట్‌ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఆయనను ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్‌కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా, ప్రస్తుతం హైకోర్టు విచారణతో పాటు మహిళా భద్రతా విభాగం దర్యాప్తు కూడా కీలక దశకు చేరుకుంది. దర్యాప్తు పురోగతి, హైకోర్టు తదుపరి విచారణ ఈ కేసులో కీలకంగా మారనున్నాయి.








