Mahaa Daily Exclusive

  అవమానమే ప్రాణం తీసిందా?.

Share

అవమానమే ప్రాణం తీసిందా?.
* బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం.

హైదరాబాద్, మహా.

పరీక్షల సమయంలో అధ్యాపకులు తనను పదేపదే అవమానించారని మనస్తాపానికి గురైన ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పుప్పాలగూడ సెక్రెటేరియట్ కాలనీలో నివాసముంటున్న శ్రేయ (20) అనే విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందడం కలకలం రేపింది. ఘటనాస్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో కళాశాల అధ్యాపకుల ప్రవర్తనపై ఆమె చేసిన వ్యాఖ్యలు కేసును మరింత కీలకంగా మార్చాయి.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రేయ ఇబ్రహీంబాగ్‌లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. సోమవారం ఆమె జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి వేడుకలు నిర్వహించారు. అనంతరం తండ్రి కింద అంతస్తులో, తల్లి, పిల్లలు పై అంతస్తులో నిద్రించారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తల్లి లేచి చూసే సరికి శ్రేయ పక్కనే ఉండగా, ఉదయం ఆరు గంటలకు కనిపించకపోవడంతో వెతికారు. పై అంతస్తులోని గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
దర్యాప్తులో భాగంగా లభించిన సూసైడ్ నోట్‌లో పరీక్షల సమయంలో ఎదురైన పరిణామాలను శ్రేయ వివరించినట్లు పోలీసులు తెలిపారు. గత నెలలో జరిగిన సెమిస్టర్ పరీక్షలో పొరపాటున సెల్‌ఫోన్‌ను పరీక్ష హాలులోకి తీసుకెళ్లడంతో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారని, ఆ ఘటన తర్వాత కూడా కొందరు అధ్యాపకులు తనను పదేపదే అనుమానంతో చూస్తూ అవమానించారని ఆమె రాసినట్లు తెలిసింది. మరో పరీక్ష సమయంలో కూడా తన కదలికలపై అనుమానం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారని, “ఒకసారి పట్టుబడిన తర్వాత కూడా కొన్ని జీవితాలకు మార్పు రాదు” అని అధ్యాపకులు అన్న మాటలు తనను తీవ్రంగా కలచివేశాయని లేఖలో పేర్కొంది.
తనను కావాలనే వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారని, పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో సిద్ధమైనప్పటికీ అధ్యాపకుల ప్రవర్తన వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని శ్రేయ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. మరో విద్యార్థిని వద్ద నుంచి కాపీ కొట్టానని చేసిన ఆరోపణలు కూడా నిరాధారమని, ఆ విద్యార్థిని ఉదయం పరీక్ష రాయగా తాను మధ్యాహ్నం పరీక్ష రాశానని, అలాంటప్పుడు కాపీ ఎలా కొట్టగలనని ప్రశ్నించింది.
తన గురించి ప్రతికూల వ్యాఖ్యలు వినాల్సి రావడంతో తోటి విద్యార్థులు కూడా దూరమయ్యారని, ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నానని శ్రేయ లేఖలో రాసింది. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని తన సోదరుడిని కోరుతూ, తాను తీసుకుంటున్న నిర్ణయానికి క్షమించాలని “ఐ యామ్ సారీ” అంటూ భావోద్వేగంగా తన చివరి సందేశాన్ని రాసినట్లు పోలీసులు తెలిపారు.
మృతురాలి తండ్రి సతీష్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్‌తో పాటు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కళాశాల అధ్యాపకులు, యాజమాన్యం, పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.