పేరు లేకుంటే ప్రభుత్వ పథకాలు రావు.
• నెలాఖరులోగా 100 శాతం నమోదు పూర్తి చేయాలి.
• కొడంగల్‌లో బీఎల్‌ఏల సమావేశంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ విమర్శలు.
హైదరాబాద్, మహా.
ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా అందకపోవచ్చని పేర్కొంటూ అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో బీఎల్‌ఏలు, పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 78 శాతం మంది మాత్రమే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నమోదు చేసుకున్నారని సీఎం తెలిపారు. మిగిలిన 22 శాతం మంది అర్హుల పేర్లు కూడా ఈ నెలాఖరులోగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారి జాబితా ఇప్పుడు రూపొందుతోందని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు. రెండు పార్టీలు రాజకీయంగా వేర్వేరుగా కనిపించినా, కాంగ్రెస్‌ను బలహీనపర్చడమే వాటి ఉమ్మడి లక్ష్యమని ఆరోపించారు. కొడంగల్‌లో కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పనిచేశాయని ఆరోపిస్తూ, ప్రజలు ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఓటరు నమోదు సమయంలో వివరాలపై సందేహాలు ఉంటే తగిన ఆధారాలు సమర్పించి నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిశీలన మరింత కఠినంగా ఉంటుందని, అందువల్ల ప్రతి అర్హుడు తప్పనిసరిగా తన పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలని అన్నారు.
అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా కొడంగల్‌లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ, ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించారని ఆరోపించిన సీఎం, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.








