విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు.
• 152 ప్రశ్నపత్రాల లీక్‌లతో 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారు.
• నీట్ లీకేజీపై కేంద్రంపై రాహుల్ గాంధీ.
ఢిల్లీ, మహా.
దేశ విద్యా వ్యవస్థను వరుస ప్రశ్నపత్రాల లీకేజీలు తీవ్రంగా దెబ్బతీశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 152 ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకోగా, దాదాపు 7.50 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మొత్తం వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని కోరారు. పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని, పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. నిరసనలో తాను గాయపడినా బాధ లేదని, కానీ విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడం బాధ కలిగిస్తోందని అన్నారు.
దేశంలో విద్య ఇప్పుడు కుటుంబాలపై భారీ ఆర్థిక భారం మోపుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక పరీక్ష కోసం విద్యార్థుల కుటుంబాలు చేసే వ్యయం, కేంద్ర ప్రభుత్వం విద్య కోసం కేటాయించే బడ్జెట్‌కు సమానంగా మారిందన్నారు. కేంద్ర విద్యా బడ్జెట్ సుమారు రూ.1.4 లక్షల కోట్లు కాగా, ప్రతి ఏడాది నీట్ పరీక్ష కోసం కుటుంబాలు దాదాపు రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇంత భారీగా ఖర్చు చేసిన తర్వాత కూడా ప్రశ్నపత్రాలు లీక్ కావడం విద్యార్థుల కుటుంబాలను నిలువునా దోచుకోవడమేనని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ సంస్థలకు మాత్రమే లాభం చేకూర్చాయని, యువత, విద్యార్థులు మాత్రం నష్టపోతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, తయారీ రంగం బలహీనపడుతోందని, బ్యాంకింగ్ వ్యవస్థను పెద్ద వ్యాపార వర్గాలు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతికి తలుపులు బార్లా తెరిచారని ఆరోపిస్తూ, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రజల గొంతుకను వినిపించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.








