Mahaa Daily Exclusive

  స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌కు భారత్ కట్టుబడి ఉంది….

Share

స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌కు భారత్ కట్టుబడి ఉంది.
* విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్.
మనీలా,మహా.
స్వేచ్ఛాయుత, సమ్మిళిత, శాంతియుత ఇండో-పసిఫిక్ ప్రాంత నిర్మాణానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, నియమాల ఆధారిత వ్యవస్థను బలోపేతం చేయడమే క్వాడ్ దేశాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో భారత్ తరఫున జైశంకర్‌తో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి పాల్గొన్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష నిర్వహించిన మంత్రులు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.

సమావేశం అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో క్వాడ్ దేశాలు ఆసియాన్ కూటమి ఐక్యత, కేంద్ర పాత్రకు తమ పూర్తి మద్దతును మరోసారి ప్రకటించాయి. సముద్ర భద్రత, ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి, రక్షణ సహకారం, కీలక సాంకేతికతలు, మానవతా సహాయం, విపత్తుల సమయంలో అత్యవసర స్పందన వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వమే ప్రాంతీయ భద్రత, అభివృద్ధికి పునాదిగా ఉంటుందని క్వాడ్ దేశాలు స్పష్టం చేశాయి.

ఇటీవలి కాలంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక, భద్రతాపరమైన సవాళ్ల నేపథ్యంలో ఆసియాన్ దేశాలతో మరింత సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. స్వేచ్ఛాయుత సముద్ర రవాణా, అంతర్జాతీయ నిబంధనల పరిరక్షణ, ప్రాంతీయ సహకారానికి క్వాడ్ కూటమి కట్టుబడి ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు.

సదస్సు సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జైశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. వాణిజ్యం, సుంకాలు, ఇంధన రంగం, రక్షణ, భద్రత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ (ఏఐ)తో పాటు ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

అంతకుముందు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, ఫిలిప్పీన్స్ విదేశాంగ కార్యదర్శి మరియా థెరిసా లాజారోతో కూడా జైశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ, ప్రాంతీయ సహకారం, పరస్పర ప్రయోజనాల అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.