నల్ల దుస్తులతో పార్లమెంట్ వద్ద విపక్షాల నిరసన.
* విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన ఎంపీలు.
* ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్..
ఢిల్లీ, మహా.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. నల్ల దుస్తులు ధరించి మకర్‌ద్వారం వద్దకు చేరుకున్న కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, జేఎంఎం తదితర పార్టీల ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై బలప్రయోగానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ కోసం మాత్రమే పోరాడుతున్నారని, వారి న్యాయమైన డిమాండ్లను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. పదేపదే ప్రశ్నపత్రాల లీకేజీలు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపించారు.
ప్రధాని నివాసం సమీపంలో జరిగిన నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని, నిరసన తెలిపే హక్కును కూడా అణచివేస్తోందని విమర్శించారు. ప్రజాప్రతినిధులను గౌరవించకుండా వ్యవహరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానం ద్వారా ఈ అంశంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరిపేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం కూడా అందుకు సహకరించాలని కోరారు.
ధర్మేంద్ర ప్రధాన్ పనితీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన వైఫల్యాలకు మంత్రి బాధ్యత వహించాలని, తన పదవికి రాజీనామా చేయకుండా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆశలను నీరుగార్చిన ఈ వ్యవహారంలో కేంద్రం జవాబుదారీతనంతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీ కే. సురేశ్ మాట్లాడుతూ, మంగళవారం నిరసన సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యకు నిరసనగానే నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్‌కు వచ్చినట్లు తెలిపారు. భద్రతా దళాల తీరును నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు చెప్పారు.
ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ మాట్లాడుతూ, పదేపదే జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పెరుగుతున్న నిరుద్యోగంపై యువత తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోరుతూ వీధుల్లోకి వచ్చిన విద్యార్థులపై అణచివేత చర్యలు చేపట్టడం బాధాకరమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమయ్యాయి. రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, విద్యార్థులపై లాఠీచార్జ్, ఇతర జాతీయ అంశాలపై ఉమ్మడి కార్యాచరణను ఖరారు చేసినట్లు సమాచారం.








