తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.
* అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ.
* 35 లక్షల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిన లక్ష్యం..
* రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కిషన్‌రెడ్డి సూచన.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రైతులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రం నుంచి సేకరించే బియ్యం పరిమాణాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, అంటే సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణకు మార్గం సుగమమైంది. ఈ నిర్ణయంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలిపారు.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025–26 ప్రారంభానికి ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల సమక్షంలో తెలంగాణ నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఈ నెల 8న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి సేకరణ లక్ష్యాన్ని పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఆ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బియ్యం సేకరణను 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిందన్నారు.
తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులు పండించిన ధాన్యానికి మరింత మార్కెట్ అవకాశాలు లభిస్తాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం తన వంతు సహకారం అందిస్తోందని చెప్పారు.
అదనంగా మంజూరైన బియ్యం సేకరణ లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేసి, కేంద్రానికి ఇచ్చిన కమిట్‌మెంట్ మేరకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు నిర్ణీత గడువులో బియ్యాన్ని అందజేయాలని కోరారు. గత మార్కెటింగ్ సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన బియ్యాన్ని గడువులోగా అందించలేక పలుమార్లు గడువు పొడిగింపు కోరిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా సమర్థవంతమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు.
గతంలో కేటాయించిన బియ్యం కోటాతో పాటు తాజాగా పెంచిన అదనపు కోటాను కూడా సకాలంలో ఎఫ్‌సీఐకి అప్పగించడం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ రైతులకు మేలు చేసే మరో కీలక అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.








