ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.
* ఉద్యోగాల భర్తీపై మరింత అధ్యయనం.
* నేతన్న భరోసాకు ఆమోదం.
* పుష్కరాలకు రూ.50 కోట్లు.
* ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచన.
అమరావతి, మహా.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల పురోగతి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, సంక్షేమ పథకాలు, విద్య, సాగునీటి ప్రాజెక్టులు, పుష్కరాల ఏర్పాట్లు, ఎల్‌నినో పరిస్థితులు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో రెండో విడతగా 3,168 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనపై మరింత సమగ్ర అధ్యయనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి తదుపరి కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ ‘నేతన్న భరోసా’ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీపీఎల్ కుటుంబాలకు చెందిన 50 ఏళ్లలోపు చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.
వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే శ్రీకాకుళంలోని బ్రహ్మకుమారీస్ సంస్థకు మున్సిపల్ స్థల లీజును కొనసాగించేందుకు అనుమతి మంజూరు చేసింది.
రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణ, భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.50 కోట్ల నిధులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్క్‌ఫెడ్‌కు సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ.300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ హామీ ఇవ్వడానికి కూడా ఆమోదం తెలిపింది.
విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీల జాబితాలో చేర్చే ఆర్డినెన్స్‌పై మంత్రివర్గం చర్చించింది. అలాగే నేరడి బ్యారేజ్ నిర్మాణానికి రూ.641.10 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసే ప్రతిపాదనను పరిశీలించింది. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్-2 పనుల అంచనా వ్యయాన్ని రూ.241.20 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెంచేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
సమావేశంలో ఎల్‌నినో ప్రభావంపై ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా, పశువులకు మేత అందుబాటులో ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
మెగా డీఎస్సీ అంశాన్ని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలతో ముడిపెట్టి వైసీపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. లేని వివాదాలను సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయని, అలాంటి ప్రచారాలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పొగాకు ధరల అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఈ విషయాన్ని ప్రతిపక్షం రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోందని మంత్రులు ప్రస్తావించగా, అలాంటి పరిస్థితికి అవకాశం ఎందుకు ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వం పొగాకు రైతుల ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యలను ముందుగానే ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, నిర్ణయాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు మంత్రులు మరింత చురుకుగా, ప్రో-యాక్టివ్‌గా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.







