- చిక్కుల్లో మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు
- పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు
- హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్, మహా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత రేగా కాంతారావు తీవ్ర చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఆర్థికంగా మోసగించారని ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపగా.. రేగా కాంతారావు వెంటనే స్పందించారు. తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు సమర్పించిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఉద్యోగ ఇంటర్వ్యూ సాకుతో రేగా కాంతారావు తనను ఫ్లాట్‌కు పిలిపించుకున్నారని, అక్కడే తనపై లైంగికంగా దాడి చేశారని సదరు యువతి ఆరోపించింది. ఆ ఘటన తర్వాత తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు.. తనను వివాహం చేసుకుంటానని కాంతారావు మాట ఇచ్చినట్లు వెల్లడించింది. ఆ నమ్మకంతోనే తాను ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించానని.. అయితే కాలక్రమేణా ఆ మాట తప్పి ఆయన తనను దారుణంగా మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. కేవలం లైంగిక వేధింపులు, పెళ్లి పేరుతో నమ్మకద్రోహానికి పాల్పడటమే కాకుండా తన వద్ద ఉన్న సొమ్మును కూడా దోచుకున్నారని బాధితురాలు ఆరోపించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయని, అందులో పెట్టుబడులు పెట్టాలనే నెపంతో తన వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని తెలిపింది. పెళ్లి, డబ్బుల విషయాన్ని అడ్డు పెట్టుకుని.. తనను లైంగికంగా, మానసికంగా తీవ్రంగా వేధించారని వివరించింది. బాధితురాలి నుంచి అందిన పూర్తి వివరాలు, ఆధారాల ఆధారంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, బాధితురాలు పేర్కొన్న వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఇది జరిగిన కాసేపటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పెళ్లి పేరుతో మోసం చేశానంటూ తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.







