Mahaa Daily Exclusive

  స్వర్ణాంధ్రకు నూతన అధ్యాయం…

Share

స్వర్ణాంధ్రకు నూతన అధ్యాయం.
* అభివృద్ధికి భోగాపురం లాంచ్‌ప్యాడ్.
* 18 వేల కోట్ల ప్రాజెక్టులతో ఏపీ ప్రగతికి సరికొత్త ఊతం.
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
* జాతికి అంకితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.

విశాఖపట్నం, మహా.

ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి, స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఒక బలమైన లాంచ్‌ప్యాడ్‌లా పనిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన ఈ ఆధునిక విమానాశ్రయ టెర్మినల్‌ను శనివారం ఆయన జాతికి అంకితం చేశారు. కేవలం విమానాశ్రయ ప్రారంభానికే పరిమితం కాకుండా, ఈ పవిత్ర నేలపై విమానయానం, జాతీయ రహదారులు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్ వంటి కీలక రంగాల్లో సుమారు 18 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే భారీ ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త శకానికి భోగాపురం వేదికైందని కొనియాడారు.
సభలో తన ప్రసంగాన్ని స్వచ్ఛమైన తెలుగులో ప్రారంభించిన మోదీ, పవిత్రమైన ఉత్తరాంధ్ర నేలపై అడుగుపెట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానంటూ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. భక్తిశ్రద్ధలతో పైడితల్లి అమ్మవారికి, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామికి నమస్కరించిన ఆయన, ఈ ప్రాంతం త్యాగానికి, దేశభక్తికి ప్రతీక అని కీర్తించారు. గతంలో విమానాశ్రయాలకు కేవలం కొద్దిమంది వ్యక్తుల పేర్లే పెట్టేవారని, కానీ తమ ప్రభుత్వం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అసువులు బాసిన మహనీయుల పేర్లను చిరస్థాయిగా నిలిపే సంప్రదాయానికి తెరతీసిందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే గిరిజన హక్కులు, స్వాభిమానం కోసం ప్రాణాలర్పించిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ విమానాశ్రయానికి నామకరణం చేసి ఆయనకు ఘనమైన నివాళి అర్పించామన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు రన్‌వేగా మాత్రమే కాకుండా పరిశ్రమలు, పర్యాటకం, ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మౌలిక సదుపాయాల కల్పనతోనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్న ప్రధాని.. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం ఒక గొప్ప వరమని అభివర్ణించారు. గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ద్వారా దీన్ని సద్వినియోగం చేసుకునేలా పోర్టులు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లను అనుసంధానం చేస్తూ రాష్ట్రంలో ‘కోస్టల్ ఎకనామిక్ కారిడార్‌’ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్థిక వ్యవస్థకు ఈ విమానాశ్రయం కొత్త దిశను చూపుతుందని, రాబోయే రోజుల్లో పెట్టుబడిదారులకు ఈ ప్రాంతాలు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానాలుగా మారనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో అరకు లోయ, బొర్రా గుహలు, సింహాచలం, భీమిలి తీరప్రాంతం వంటి పర్యాటక కేంద్రాలకు దేశ, విదేశీ పర్యాటకుల రాక అనూహ్యంగా పెరుగుతుందని అంచనా వేశారు.
ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకు ఊతం ఇచ్చేలా నవ్యాంధ్రలో ఆధునిక పరిశ్రమల స్థాపనకు కేంద్రం పెద్దపీట వేస్తోందని మోదీ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద విశాఖపట్నంలో రాష్ట్రంలోనే తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా అత్యాధునిక సాంకేతిక రంగంలో ఏపీ కీలక స్థానాన్ని సంపాదించడమే కాకుండా, యువ ఇంజినీర్లకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చేపడుతున్న సోలార్, విండ్ ఎనర్జీ జోన్ల అభివృద్ధి దీనికి నిదర్శనమని వివరించారు. మరోవైపు, జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా రేచెర్ల–గురువాయిగూడెం, దేవరపల్లి నాలుగు వరుసల జాతీయ రహదారులు, తాడిపత్రి బైపాస్ వంటి ప్రాజెక్టులతో రవాణా వ్యవస్థ మరింత వేగవంతం అవుతుందన్నారు.
దేశ విమానయాన రంగం గత దశాబ్దంలో సాధించిన అద్భుత ప్రగతిని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 166కు చేరిందని, ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు సైతం విమాన ప్రయాణం చేరువైందని హర్షం వ్యక్తం చేశారు. ఇక విమానాశ్రయానికి చేరుకోగానే ప్రధానికి లభించిన అపూర్వ స్వాగతం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. 13 వేల ఐదు వందల మందికి పైగా గిరిజన కళాకారులు గులాబీ రంగు చీరలు, ఆకుపచ్చ అంచులతో ఒకేసారి చేసిన సాంప్రదాయ ధింసా నృత్యం, టెర్మినల్ వద్ద వందలాది మంది విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భారతీయ సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టాయని ప్రధాని మురిసిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పట్ల స్పష్టమైన దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని ప్రశంసించిన మోదీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో స్వర్ణాంధ్ర సాకారం కావడం తథ్యమని భరోసా ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానంలో కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.