Mahaa Daily Exclusive

  హిరోషిమా అణుబాంబు పేలుడుతో కొత్త లోహ మిశ్రమం…

Share

హిరోషిమా అణుబాంబు పేలుడుతో కొత్త లోహ మిశ్రమం.
* శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ.
* 81 ఏళ్ల తర్వాత వెలుగులోకి కొత్త నిజం.
* భవిష్యత్ పదార్థాల అభివృద్ధికి దోహదపడే అవకాశం.
ఢిల్లీ, మహా.

1945లో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా జరిపిన అణుబాంబు దాడి మానవ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది. అయితే, ఆ విధ్వంసకర ఘటన జరిగిన దాదాపు ఎనిమిది దశాబ్దాల తర్వాత శాస్త్రవేత్తలు మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అణుబాంబు పేలుడు ప్రభావంతో భూమిపై ఇప్పటివరకు సహజంగా గుర్తించని ఓ కొత్త లోహ మిశ్రమం ఏర్పడినట్లు తమ పరిశోధనలో గుర్తించినట్లు వెల్లడించారు. అణు విస్ఫోటన సమయంలో ఏర్పడిన అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతలు, ఒత్తిడి వంటి అసాధారణ పరిస్థితులు కొత్త రకాల పదార్థాల ఏర్పాటుకు దారితీస్తాయని ఈ పరిశోధన సూచిస్తోందని తెలిపారు.
ఈ పరిశోధనలో భాగంగా హిరోషిమా బే ప్రాంతంలోని ఇసుకలో లభించిన చిన్న గాజు బిందువులను, వీటిని ‘హిరోషిమైట్స్’గా పిలుస్తారు, శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో విశ్లేషించారు. అణుబాంబు పేలుడు సమయంలో భవనాలు, లోహాలు, నేల, గాజు, నీరు సుమారు 12 వేల డిగ్రీల ఫారెన్‌హీట్‌ కంటే అధిక ఉష్ణోగ్రతలకు చేరుకుని ఆవిరైపోయి, అనంతరం క్షణాల్లోనే చల్లబడటంతో ఈ సూక్ష్మ అవశేషాలు ఏర్పడ్డాయని పరిశోధకులు వివరించారు.
మొత్తం 34 హిరోషిమైట్ నమూనాలను శక్తివంతమైన ఎక్స్‌రే డిఫ్రాక్షన్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ల సహాయంతో పరిశీలించిన శాస్త్రవేత్తలు వాటిలోని సూక్ష్మ లోహ కణాలను గుర్తించి వాటి అణు నిర్మాణాన్ని విశ్లేషించారు. సాధారణంగా కనిపించే ఇనుము–క్రోమియం మిశ్రమాలతో పాటు, ఇప్పటివరకు ఎక్కడా గుర్తించని ప్రత్యేక లోహ నిర్మాణం కలిగిన సూక్ష్మ కణాన్ని కనుగొన్నారు.
ఈ కొత్త లోహ మిశ్రమంలో ఇనుము, క్రోమియం, నికెల్, మాంగనీస్, మాలిబ్డెనం, సిలికాన్, అల్యూమినియం వంటి మూలకాలు ఉన్నప్పటికీ, అవి కలిసిన విధానం సాధారణ మిశ్రమ లోహాలకు పూర్తిగా భిన్నమైన అణు నిర్మాణాన్ని కలిగి ఉందని పరిశోధకులు వెల్లడించారు. అణుబాంబు పేలుడు సమయంలో లోహ ఆవిరి అత్యంత వేగంగా చల్లబడటమే ఈ అరుదైన నిర్మాణం ఏర్పడటానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ ఆవిష్కరణతో అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు, అధిక పీడనం వంటి మానవ నిర్మిత పరిస్థితుల్లో ఇప్పటివరకు తెలియని కొత్త పదార్థాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ కొత్త లోహ మిశ్రమంపై మరింత పరిశోధన జరిపితే భవిష్యత్తులో తేలికైన, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే కొత్త తరహా పదార్థాల అభివృద్ధికి ఉపయోగపడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అలాగే అణుబాంబు విస్ఫోటనాల సమయంలో జరిగే భౌతిక, రసాయన మార్పులను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి కూడా ఈ అధ్యయనం దోహదపడుతుందని తెలిపారు.
కాగా, 1945 ఆగస్టు 6న అమెరికా ‘లిటిల్ బాయ్’ పేరుతో సుమారు 9 వేల పౌండ్ల బరువున్న అణుబాంబును హిరోషిమాపై ప్రయోగించింది. దాదాపు 20 వేల టన్నుల టీఎన్‌టీ పేలుడు శక్తితో సంభవించిన ఈ విస్ఫోటనంలో సుమారు 1.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, రేడియేషన్ ప్రభావంతో అనంతర కాలంలో వేలాది మంది ప్రాణాంతక వ్యాధులకు గురయ్యారు. హిరోషిమా అణుదాడి ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో అణ్వాయుధాల వినాశకర ప్రభావానికి నిదర్శనంగా నిలిచింది.

Latest