Mahaa Daily Exclusive

  భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి….

Share

భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.
* మూడో ప్రమాద హెచ్చరిక జారీ.
* 55 అడుగులకు చేరిన నీటిమట్టం.
* 15.40 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం.
* లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు.
హైదరాబాద్, మహా.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చింది. భారీ వరద ప్రవాహంతో శనివారం ఉదయం గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో సుమారు 15.40 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉద్ధృతితో స్నాన ఘట్టాలు, కల్యాణకట్ట, విద్యుత్ స్తంభాలు నీట మునిగిపోయాయి.

వరద ప్రభావంతో భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో పలు రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చర్ల మండలంలోని తూరుబాక వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండగా, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో తొలి ప్రమాద హెచ్చరిక, మధ్యాహ్నం 48 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు, శనివారం ఉదయం 55 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరికను ప్రకటించారు.

ఎగువన కాళేశ్వరం ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో గురువారం 30 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటిమట్టం శుక్రవారం అర్ధరాత్రికి 53 అడుగులకు, శనివారం ఉదయానికి 55.1 అడుగులకు చేరింది. పరిస్థితిని జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

వరద ఉద్ధృతితో దుమ్ముగూడెం-భద్రాచలం మధ్య రాకపోకలను శుక్రవారం సాయంత్రం నుంచే నిలిపివేశారు. పర్ణశాల వద్ద స్నాన ఘట్టాలు పూర్తిగా మునిగిపోగా, సీతవాగు సమీపంలోని సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జి కూడా నీట మునిగాయి. తూరుబాక ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై కొత్తగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న అప్రోచ్ రోడ్లు కోతకు గురికావడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.

చర్ల మండలం వీరాపురం శివారులోని ఇసుక క్వారీలో ఒక్కసారిగా వరద నీరు చేరడంతో చిక్కుకుపోయిన 44 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు. వారిలో లారీ డ్రైవర్లు, స్థానికులు ఉన్నారు. అయితే అక్కడ ఇంకా 30కి పైగా లారీలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. రక్షణ చర్యల సందర్భంగా తెప్పపై వెళ్తున్న సీఐ రాజువర్మ, ఎస్‌ఐ నర్సిరెడ్డి వరద నీటిలో పడిపోయినా ఈదుకుంటూ తిరిగి తెప్పపైకి చేరడంతో పెను ప్రమాదం తప్పింది.

గోదావరి వరద పరిస్థితులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భద్రతా చర్యల్లో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. అధికారుల సూచనలను పాటించాలని, వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు శనివారం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, పెద్దపల్లి జిల్లాలోని పార్వతి పంప్‌హౌస్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Latest