Mahaa Daily Exclusive

  రికార్డు స్థాయి వాణిజ్య పన్నుల వసూళ్లు…

Share

రికార్డు స్థాయి వాణిజ్య పన్నుల వసూళ్లు
* రూ.7,865 కోట్ల ఆదాయం.
* గతేడాదితో పోలిస్తే 19 శాతం వృద్ధి.
* జీఎస్టీ వృద్ధిలో దేశంలో రెండో స్థానం

హైదరాబాద్, మహా .

తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ శాఖ 2026 జూలై నెలలో చరిత్రలోనే అత్యధికంగా రూ.7,865 కోట్ల వాణిజ్య పన్ను (జీఎస్టీ, వ్యాట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ కలిపి) వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది జూలైలో నమోదైన రూ.6,624 కోట్ల వసూళ్లతో పోలిస్తే 19 శాతం వృద్ధి నమోదు కాగా, ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర ఆదాయం రూ.1,241 కోట్లు పెరిగింది.

ఇంతకుముందు 2026 ఏప్రిల్‌లో నమోదైన రూ.7,598 కోట్ల రికార్డును అధిగమిస్తూ జూలై నెలలో అత్యధిక పన్ను వసూళ్లు నమోదయ్యాయి. ఇందులో ఒక్క జీఎస్టీ ద్వారానే రూ.4,452 కోట్లు వసూలు కాగా, ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 22 శాతం అధికం కావడం విశేషం.

తెలంగాణలో నమోదైన పన్ను చెల్లింపుదారుల నుంచి జూలై నెలలో ఐజీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ కలిపి మొత్తం రూ.5,819 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇందులో కూడా 19 శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్రాల వారీగా జీఎస్టీ వృద్ధి రేటులో హర్యానా తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలవగా, దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు 10 శాతం మాత్రమే నమోదైనట్లు కమర్షియల్ ట్యాక్స్ శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వేగంగా విస్తరించడం, కొత్త పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, ఉపాధి పెరగడం, వినియోగం అధికమవడం వంటి అంశాలు ఈ రికార్డు స్థాయి ఆదాయ వృద్ధికి ప్రధాన కారణాలని అధికారులు తెలిపారు. అలాగే సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ, పన్ను ఎగవేతను అరికట్టేందుకు చేపట్టిన చర్యలు కూడా ఆదాయాన్ని గణనీయంగా పెంచినట్లు పేర్కొన్నారు.

నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జూలై నెలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన కమర్షియల్ ట్యాక్స్ శాఖ, 165 మంది పన్ను చెల్లింపుదారులపై చర్యలు తీసుకుంది. వారి జీఎస్టీ రిజిస్ట్రేషన్లను సస్పెండ్ చేయడంతో పాటు, సుమారు రూ.300 కోట్ల నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ బదిలీని అడ్డుకున్నట్లు వెల్లడించింది.

జూలై 2026లో రాష్ట్రవ్యాప్తంగా 4,61,276 మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేసి పన్నులు చెల్లించినందుకు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ ఎం. రఘునందన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. పారదర్శకమైన, సమర్థవంతమైన, పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన వ్యవస్థను కొనసాగిస్తూ ఆదాయ వృద్ధిని మరింత బలోపేతం చేయడానికి శాఖ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

Latest