Mahaa Daily Exclusive

  మరణించిందనుకున్న మహిళలో కదలికలు…

Share

మరణించిందనుకున్న మహిళలో కదలికలు.
* అంబులెన్స్ కుదుపులతో వెలుగులోకి ఆశ్చర్యకర ఘటన.
* ఏలూరు జిల్లా ఘటన కలకలం.
* విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో చికిత్స

ఏలూరు, మహా.
ఏలూరు జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు నిర్ధారించిన మహిళ, అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తరలిస్తుండగా అంబులెన్స్‌లో ఒక్కసారిగా కదలికలు కనిపించడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆమెను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

కైకలూరు మండలం భుజబలపట్నం గ్రామ మాజీ సర్పంచ్ గురజాల రామతులసి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఏలూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం అంత్యక్రియల కోసం అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఓ పెద్ద గుంతలో వాహనం బలంగా కుదుపులకు గురైంది.

ఆ కుదుపుల అనంతరం రామతులసి శరీరంలో కదలికలు కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆమె స్పందిస్తున్నట్లు గుర్తించిన వారు ఆలస్యం చేయకుండా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.