ఈపీఎఫ్‌వో నిధుల పెట్టుబడుల వ్యవహారంపై సీబీఐ కేసు.
* రూ.1,816 కోట్ల నష్టం ఆరోపణలు.
* రిలయన్స్ క్యాపిటల్ ఎన్‌సీడీల్లో పెట్టుబడులపై దర్యాప్తు.
ఢిల్లీ, మహా.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పెట్టుబడులకు సంబంధించిన భారీ ఆర్థిక వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈపీఎఫ్‌వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూలై 31, 2026న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాసఘాతుకం, అధికార దుర్వినియోగం తదితర ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది.
ఈపీఎఫ్‌వో ఫిర్యాదు ప్రకారం, ఈ వ్యవహారంలో సంస్థకు రూ.1,007.55 కోట్ల అసలు నష్టం, రూ.808.67 కోట్ల వడ్డీ నష్టం కలిపి మొత్తం రూ.1,816.22 కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ జారీ చేసిన సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లలో (ఎన్‌సీడీలు) ఈపీఎఫ్‌వో సుమారు రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులో వెల్లడించింది.
రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌తో పాటు మరో మూడు పోర్ట్‌ఫోలియో మేనేజర్ల ద్వారా ఈ పెట్టుబడులు చేసినట్లు సీబీఐ తెలిపింది. 2023-24 మధ్య కాలంలో ఈ డిబెంచర్లు మెచ్యూర్ కావాల్సి ఉండగా, చెల్లింపులు జరగకపోవడంతో వివాదం తలెత్తింది. నిధులను మళ్లించడం, మోసపూరిత ఆర్థిక లావాదేవీల కారణంగానే డిబెంచర్ల చెల్లింపులు నిలిచిపోయాయని ఈపీఎఫ్‌వో ఆరోపించినట్లు సీబీఐ వెల్లడించింది.
ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, సంబంధిత సంస్థల పాత్రపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. నిధుల మళ్లింపులో ఎవరెవరు పాల్గొన్నారు, నేరపూరిత కుట్ర ఎలా జరిగింది, మళ్లించిన నిధులు ఎక్కడికి వెళ్లాయి, వాటిని ఎలా వినియోగించారు వంటి అంశాలపై సీబీఐ లోతుగా విచారణ చేపట్టింది.
ఇదిలా ఉండగా, రిలయన్స్ ఏడీఏ గ్రూప్‌కు చెందిన పలు ఆర్థిక వ్యవహారాలపై సీబీఐ గతంలోనూ కేసులు నమోదు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ తదితర సంస్థల ఫిర్యాదుల ఆధారంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ (ఆర్‌సీఎఫ్‌ఎల్), రిలయన్స్ టెలికామ్ (ఆర్‌టీఎల్)లకు సంబంధించిన వ్యవహారాల్లో ఇప్పటికే ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది.
రిలయన్స్ ఏడీఏ గ్రూప్‌కు సంబంధించిన కేసుల్లో ఇప్పటివరకు నాలుగు ఛార్జ్‌షీట్లు దాఖలు చేయడంతో పాటు ఏడుగురిని అరెస్టు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఈ కేసులకు సంబంధించిన దర్యాప్తు ప్రక్రియను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోందని పేర్కొంది. తాజా ఈపీఎఫ్‌వో పెట్టుబడుల కేసులోనూ నిధుల మళ్లింపు వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థల పాత్రను వెలికితీసేందుకు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీబీఐ స్పష్టం చేసింది.







