Mahaa Daily Exclusive

  కాళేశ్వరం కూలిపోవడానికి బీఆర్ఎస్‌దే బాధ్యత…

Share

కాళేశ్వరం కూలిపోవడానికి బీఆర్ఎస్‌దే బాధ్యత.
* ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడలేం.
* మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఫౌండేషన్‌ల్లో తీవ్ర లోపాలు.
* భద్రతకే తొలి ప్రాధాన్యం.
* తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
పెద్దపల్లి, మహా.
కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న నిర్మాణ లోపాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయాలు చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని, కాళేశ్వరం బ్యారేజీల భద్రతే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ నాణ్యతపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ), కడెం, ఎల్లంపల్లి వంటి ప్రధాన ప్రాజెక్టులు ఇప్పటికీ దృఢంగా ఉన్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాల కారణంగానే నేడు ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఎల్లంపల్లి పంపులను ఆన్ చేసి మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోశామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని, కానీ ప్రస్తుతం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయాయని విమర్శించారు.
జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదికలు, ఐఐటీ బాంబే నిపుణుల సూచనల ఆధారంగానే బ్యారేజీల్లో నీటి నిల్వలను పరిమితం చేస్తున్నామని మంత్రి తెలిపారు. భద్రతా ప్రమాణాలను విస్మరించి కన్నెపల్లి పంపులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఫౌండేషన్‌ల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని నిపుణుల నివేదికలు స్పష్టం చేశాయని ఉత్తమ్ అన్నారు. అందువల్ల వచ్చే వర్షాకాలం వరకు నిపుణుల సూచనల మేరకే నీటి నిల్వలను నియంత్రిస్తామని చెప్పారు. ఎలాంటి సాంకేతిక భద్రతా అనుమతులు లేకుండా భారీగా నీటిని నిల్వ చేస్తే డ్యాం దిగువన ఉన్న గ్రామాల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
“ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగే నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదు. భద్రతను పక్కనబెట్టి బ్యారేజీల్లో నీరు నిల్వ చేయాలని బీఆర్ఎస్ చెబుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు?” అని మంత్రి ప్రశ్నించారు.
కాళేశ్వరం అంశంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నామని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకునే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిపుణుల నివేదికలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగానే ముందుకు సాగుతుందని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన తేల్చిచెప్పారు.

Latest