Mahaa Daily Exclusive

  లష్కర్ బోనాల్లో సీఎం రేవంత్.

Share

  •  అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనం సమర్పణ.

హైదరాబాద్, మహా.

సికింద్రాబాద్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.

అనంతరం లష్కర్ బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ విందులో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ అంతటా భక్తిశ్రద్ధల మధ్య ఉత్సవాలు కొనసాగగా, వేలాదిమంది భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు భద్రత, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.