Mahaa Daily Exclusive

  సంపద సృష్టిలో సరికొత్త సునామీ….

Share

సంపద సృష్టిలో సరికొత్త సునామీ.
* సౌదీ అరేబియా సంచలనం.
* కొత్త కుబేరులతో దూసుకెళ్లనున్న భారత్.

హైదరాబాద్, మహా.

ప్రపంచ సంపద ముఖచిత్రం శరవేగంగా మారుతోంది. గ్లోబల్ ఎకానమీలో పాత పెద్దలు వెనుకబడుతుండగా, సరికొత్త దేశాలు సంపద సృష్టిలో సునామీ సృష్టిస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో, అంటే 2026 నుండి 2031 వరకు, ఏ దేశాల్లో అత్యధికంగా బిలియనీర్లు పుట్టుకురాబోతున్నారనే దానిపై ‘నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2026 సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో ఊహించని దేశాలు అత్యధిక వృద్ధితో టాప్ లో నిలవడం ప్రపంచ ఆర్థికవేత్తలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇది కేవలం వ్యక్తుల సంపద వృద్ధిని మాత్రమే కాదు, ఆయా దేశాల భవిష్యత్తు ఆర్థిక ఆధిపత్యాన్ని అద్దం పడుతోంది.

*సౌదీ అరేబియా ట్రిపుల్ ధమాకా*

ఈ జాబితాలో అత్యంత సంచలనాత్మకమైన విషయం గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియా అగ్రస్థానంలో నిలవడం. 2031 నాటికి ఏకంగా 183 శాతం వృద్ధితో తన బిలియనీర్ల జనాభాను దాదాపు మూడు రెట్లు పెంచుకోబోతోంది. దశాబ్దాలుగా కేవలం చమురు వ్యాపారంపైనే ఆధారపడిన సౌదీ అరేబియా, నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు , పర్యాటక రంగం వైపు తన పెట్టుబడులను మళ్ళిస్తుండటమే ఈ సంచలన వృద్ధికి ప్రధాన కారణం.
పోలాండ్ మరియు ఐరోపా దేశాల సరికొత్త పునాది
ఇక ఈ జాబితాలో అత్యంత ఆశ్చర్యకరంగా రెండవ స్థానంలో నిలిచిన దేశం పోలాండ్. ఏకంగా 123 శాతం వృద్ధితో యూరప్‌లో సరికొత్త ఆర్థిక శక్తిగా పోలాండ్ ఎదుగుతుండటం విశేషం. అభివృద్ధి చెందిన దేశాలైన స్వీడన్ 81 శాతం వృద్ధితో మూడవ స్థానంలో, డెన్మార్క్ 75 శాతంతో ఐదవ స్థానంలో, నార్వే 53 శాతంతో తొమ్మిదవ స్థానంలో, ఆస్ట్రియా 50 శాతంతో 11 స్థానంలో నిలిచి తమ సత్తా చాటుతున్నాయి. ఆస్ట్రేలియా 77 శాతం వృద్ధితో నాలుగవ స్థానంలో నిలిచి తన స్థిరమైన ఆర్థిక విధానాలను, మైనింగ్ , టెక్ రంగాల బలాన్ని నిరూపించుకుంటోంది.

*గర్వకారణంగా భారతీయ కుబేరుల ప్రభంజనం*

సరికొత్త ఆవిష్కరణలు, అంకుర సంస్థల (స్టార్టప్స్) ప్రభంజనంతో రికార్డులు సృష్టిస్తున్న మన భారతదేశం ఈ జాబితాలో 51 శాతం వృద్ధితో టాప్ 10 లో సగర్వంగా నిలిచింది. రాబోయే ఐదేళ్లలోనే భారత్ ఏకంగా 100 కి పైగా కొత్త బిలియనీర్లను సృష్టించబోతోందని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ఘంటాపథంగా స్పష్టం చేసింది. డిజిటల్ విప్లవం, యువత సృష్టిస్తున్న నూతన వ్యాపార సామ్రాజ్యాలు, మౌలిక సదుపాయాల కల్పన మరియు అంతర్జాతీయ పెట్టుబడులు భారత్‌ను ఈ అత్యున్నత స్థాయిలో నిలబెడుతున్నాయి.
ఆసియా , లాటిన్ అమెరికా దేశాల హవా
ఆసియా దేశాల్లో టెక్నాలజీ దిగ్గజం జపాన్ 65 శాతం వృద్ధితో 6 స్థానంలో నిలిచి తన పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. లాటిన్ అమెరికా దేశమైన మెక్సికో 63 శాతంతో 7 స్థానంలో నిలవగా, ఆసియా నుండి ఫిలిప్పీన్స్ కూడా 63 శాతం వృద్ధితో 8 స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచింది. ఇక ఇండోనేషియా 49 శాతం, మలేషియా 39 శాతం, , సింగపూర్ 35 శాతం వృద్ధితో ఆసియా ఖండపు ప్రాబల్యాన్ని చాటిచెబుతున్నాయి.
ఆఫ్రికా ఖండం నుండి సౌత్ ఆఫ్రికా 40 శాతం వృద్ధితో ఉనికి చాటుకుంది. అలాగే స్పెయిన్ 40 శాతం, ఇటలీ 34 శాతం, కెనడా 33 శాతం, టర్కీ 31 శాతం , బ్రెజిల్ 31 శాతం బిలియనీర్ల వృద్ధిని నమోదు చేయనున్నాయని ఈ నివేదిక అంచనా వేసింది.

ప్రపంచ ఆధిపత్య పోరులో సంపదే అత్యంత కీలకమైన ఆయుధం. పాతతరం పరిశ్రమల స్థానంలో సాంకేతికత, డిజిటల్ ఆస్తులు, గ్రీన్ ఎనర్జీ రంగాలు కొత్త బిలియనీర్లకు జన్మనిస్తున్నాయి. ఈ ‘నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్’ గణాంకాలు భవిష్యత్తులో పెట్టుబడుల ప్రవాహం ఎటువైపు సాగుతుందో, ఏ దేశాలు ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసించబోతున్నాయో స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఈ రేసులో వందకు పైగా కొత్త బిలియనీర్లతో భారత్ సాధించబోతున్న ముందడుగు భవిష్యత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన ఆధిపత్యానికి తిరుగులేని సాక్ష్యంగా నిలవబోతోంది.

Latest