Mahaa Daily Exclusive

  జయశంకర్ ఆరాటం..కేసీఆర్ పోరాటమే బలం…

Share

జయశంకర్ ఆరాటం..కేసీఆర్ పోరాటమే బలం.
* జీఆర్ఎంబీ సమావేశాన్ని బహిష్కరించాలి.
* నీటి హక్కులపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి
హరీశ్ రావు.

సిద్దిపేట, మహా.

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌కు సిద్దిపేట ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కేసీఆర్ పోరాటం, జయశంకర్ ఆరాటం ఫలితమేనని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆత్మను అర్థం చేసుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కానీ, తర్వాత కానీ కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ ఆకాంక్షలను సమర్థించే విధంగా వ్యవహరించలేదని ఆరోపించారు.
కేసీఆర్ నాయకత్వంలో గోదావరి జలాల్లో తెలంగాణకు 380 టీఎంసీల హక్కును సాధించామని గుర్తు చేసిన హరీశ్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టుకూ అనుమతి తీసుకురాలేకపోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) చరిత్రలో తొలిసారిగా ఇప్పటికే అనుమతులు పొందిన తెలంగాణ ప్రాజెక్టులను పునఃసమీక్షించి, రద్దు చేయాలనే అంశాన్ని అజెండాలో చేర్చడం ఆందోళనకరమని అన్నారు. గతంలో జరిగిన 18 వరకు జీఆర్ఎంబీ సమావేశాల్లో ఇలాంటి ప్రతిపాదన ఎప్పుడూ రాలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీఆర్ఎంబీ అజెండాను మార్చించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా తెలంగాణ ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే జీఆర్ఎంబీ సమావేశాన్ని బహిష్కరించాలని హరీశ్ రావు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు.
సమ్మక్క–సారక్క ప్రాజెక్టుకు ఇప్పటికే 47 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చినప్పటికీ, ఆ నీటి హక్కులను ప్రభుత్వం ఎందుకు వదులుకుంటోందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సార్ఎస్పీ స్టేజ్–2 ప్రాజెక్టుకు సమ్మక్క–సారక్క ప్రాజెక్టు నీళ్లు అత్యంత అవసరమని పేర్కొన్నారు.
గోదావరి జలాలను బనకచర్ల ప్రాజెక్టుకు మళ్లించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందం చేసుకుందని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్ర నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం రాజీ పడితే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.