Mahaa Daily Exclusive

  అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్వల్పంగా తగ్గుదల…

Share

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్వల్పంగా తగ్గుదల.
• ఇరాన్–ఒమన్ చర్చలతో సానుకూల సంకేతాలు.
• భారత్‌కు ఊరట లభించే అవకాశం.

ఢిల్లీ, మహా.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హోర్ముజ్ జలసంధి వినియోగంపై ఇరాన్–ఒమన్ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా సాగుతుండటంతో పాటు, అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆశావహ సంకేతాలు వెలువడటంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ మెరుగుపడింది. దీంతో ప్రపంచ చమురు సరఫరాపై నెలకొన్న ఆందోళనలు కొంత మేర తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా దిగివచ్చాయి.
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ద్వారా సాధారణ రవాణా పునరుద్ధరించే అవకాశాలపై మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే జరుగుతుండటంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు ఊరట లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్–అమెరికా మధ్య చర్చలు ఇంకా తుది దశకు చేరుకోకపోవడం, ఎర్ర సముద్రంలో కొనసాగుతున్న భద్రతా సవాళ్లు, హౌతీ తిరుగుబాటుదారుల దాడుల ముప్పు వంటి అంశాలు చమురు మార్కెట్‌పై ఇంకా ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు. దీంతో రానున్న రోజుల్లో కూడా చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
హోర్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకుని, చమురు రవాణా సాధారణ స్థితికి వస్తే భారత్‌కు గణనీయమైన ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. దేశీయ అవసరాలకు కావాల్సిన ముడి చమురులో అధిక భాగాన్ని భారత్ దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గితే దిగుమతి వ్యయం తగ్గడంతో పాటు చమురు కంపెనీలపై భారం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
చమురు ధరలు తగ్గడం వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా సానుకూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అలాగే దిగుమతి బిల్లు తగ్గడం ద్వారా ద్రవ్యోల్బణ నియంత్రణ, విదేశీ మారక నిల్వల పరిరక్షణకు కూడా ఇది కొంత మేర తోడ్పడే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.