Mahaa Daily Exclusive

  సీడబ్ల్యూసీ, అంతర్రాష్ట్ర అనుమతుల తర్వాతే బనకచర్ల ప్రాజెక్టు…

Share

సీడబ్ల్యూసీ, అంతర్రాష్ట్ర అనుమతుల తర్వాతే బనకచర్ల ప్రాజెక్టు.
* కొత్త ప్రతిపాదన పంపాలని ఏపీకి సూచన.
* రాజ్యసభలో కేంద్రం స్పష్టీకరణ.
ఢిల్లీ, మహా.
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు, అంతర్రాష్ట్ర ఆమోదాలు పొందిన తర్వాతే ప్రాజెక్టు ప్రతిపాదనను పరిశీలిస్తామని తెలిపింది. ఈ మేరకు అవసరమైన అనుమతులతో కొత్త ప్రతిపాదనను సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది.

రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్లా బాబూరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం సమర్పించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ దరఖాస్తును ప్రస్తుత రూపంలో ఆమోదించలేదని తెలిపారు.

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన అంశం కావడంతో, ముందుగా కేంద్ర జల సంఘం స్పష్టమైన అనుమతి, సంబంధిత రాష్ట్రాల ఆమోదాలు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం పేర్కొంది. ఆ ప్రక్రియ పూర్తైన తర్వాత సవరించిన ప్రతిపాదనను సమర్పిస్తే తదుపరి పరిశీలన చేపడతామని వెల్లడించింది.

పర్యావరణ మదింపు నిపుణుల కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు కేంద్రం తెలిపింది. అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన అంశాలు, సీడబ్ల్యూసీ అనుమతులు పూర్తయ్యాకే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని కమిటీ సూచించినట్లు పేర్కొంది.

అదేవిధంగా, 1980 గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డును ఈ ప్రాజెక్టు ఉల్లంఘిస్తోందంటూ పలు ఫిర్యాదులు అందిన విషయాన్ని కేంద్రం వెల్లడించింది. ఆ అభ్యంతరాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ అనుమతులు, అంతర్రాష్ట్ర సమ్మతులు, చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.