Mahaa Daily Exclusive

  విమాన ఇంధనంలో ఇథనాల్ కలపడం లేదు….

Share

విమాన ఇంధనంలో ఇథనాల్ కలపడం లేదు.
• సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.
• ప్రయాణికులు భయపడొద్దన్న మంత్రి రామ్మోహన్ నాయుడు.

ఢిల్లీ, మహా.

విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్)లో ఇథనాల్ కలుపుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ తరహా తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, బాధ్యతారాహిత్యంగా ప్రచారం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విమాన ప్రయాణికుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని ఆయన పునరుద్ఘాటించారు.

విమాన ఇంధనంలో ఇథనాల్ బ్లెండింగ్ చేస్తున్నారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇథనాల్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ రెండూ పూర్తిగా వేర్వేరు ఇంధనాలేనని, వీటికి పరస్పరం ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఇథనాల్‌ను విమాన ఇంధనంగా వినియోగించడం లేదని, ఎస్ ఎ పి మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక సాంకేతిక విధానాలతో తయారుచేసే ప్రత్యామ్నాయ విమాన ఇంధనమని చెప్పారు.

విమానయాన రంగంలో భద్రతే అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న రామ్మోహన్ నాయుడు, అన్ని నిర్ణయాలు అత్యున్నత భద్రతా ప్రమాణాలను అనుసరించే విధంగానే తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికుల ప్రాణ భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారనే ప్రచారాన్ని పూర్తిగా ఖండించింది. ప్రస్తుతం వినియోగిస్తున్న సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశించిన కఠిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొంది.

విమానయాన భద్రత వంటి కీలక అంశాలపై నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలతో ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అధికారిక వర్గాలు విడుదల చేసే సమాచారాన్నే విశ్వసించాలని సూచించింది.