నీట్ పరీక్షలో భారీ మార్పులకు కేంద్రం కసరత్తు.
• పెన్-పేపర్ విధానానికి గుడ్‌బై?.
• కంప్యూటర్ ఆధారిత పరీక్షపై సుప్రీంకోర్టుకు అఫిడవిట్.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ పరీక్ష విధానంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న పెన్-అండ్-పేపర్ విధానాన్ని మార్చి, జేఈఈ తరహాలో కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది. పరీక్షల పారదర్శకత, భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రతిపాదిత మార్పుల ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
నీట్ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నందన్ నిలేకని నేతృత్వంలోని హైపవర్ టాస్క్‌ఫోర్స్ సిఫార్సుల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. ఆ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాతే పరీక్ష విధానంలో మార్పులపై నిర్ణయం ఉంటుందని అఫిడవిట్‌లో పేర్కొంది.
నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు కొనసాగుతోందని కూడా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) స్థానంలో స్వతంత్ర, బలమైన పరీక్షల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ అఫిడవిట్‌ను సమర్పించింది.
కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌పై స్పందించాలని పిటిషనర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఆగస్టు 19కు వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా, కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని అమలు చేయాలనుకుంటే విద్యార్థులకు ముందుగానే స్పష్టమైన సమాచారం ఇవ్వాలని వైద్యుల సంఘం కేంద్రాన్ని కోరింది. అలాగే పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అమెండ్‌మెంట్) యాక్ట్–2026ను కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది.
కాగా, ఈ ఏడాది మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలతో రద్దు కాగా, అనంతరం జూన్ 21న ఎన్‌టీఏ రీ-టెస్ట్ నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.






