Mahaa Daily Exclusive

  స్థానిక సమస్యల పై పాలకవర్గం దృష్టి పెట్టాలి…

Share

  • స్థానిక సమస్యల పై పాలకవర్గం దృష్టి పెట్టాలి
  • సీపీఎం వైరా డివిజన్ నేత కొండబోయిన ఉమావతి

కారేపల్లి, మహ : సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి పంచాయతీ సమస్యలపై పాలక వర్గం ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీఎం వైరా డివిజన్ కమిటీ సభ్యురాలు కొండబోయిన ఉమావతి డిమాండ్ చేశారు. గురువారం కారేపల్లి శాఖ సమావేశం సీనియర్ నాయకులు తలారి దేవప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఉమావతి మాట్లాడుతూ కారేపల్లిలో డ్రైనేజీ, రోడ్లు, వీధిలైట్లు, విద్యుత్, మంచినీరు, పారిశుధ్యం సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. పంచాయతీ క పాలకవర్గం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సినిమా హాల్, పాత డీబీ సెంటర్, ఇమ్మడి బజార్ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకముందే జాగ్రత్తవహించాలన్నారు. స్థానికంగా విద్యుత్ లైన్‌మ్యాన్‌లేక పోవటంతో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం కల్గుతుందన్నారు. కారేపల్లిలోని అన్ని వీధులకు సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని, సైడ్ డ్రైనేజీలను నిర్మించాలని కోరారు. బస్టాండ్ సెంటర్‌లో నిర్మాణ పనులను పూర్తి చేసి నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ప్రజల నివాస గృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు, అపరిశుభ్రత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంచాయతీలోనెలకొన్నసమస్యలను సత్వర పరిష్కారంకు స్థానిక సర్పంచ్, పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం శాఖ కార్యదర్శి అన్నారపు కృష్ణ, నాయకులు ముండ్ల ఏకాంబరం, ఇల్లంగి పిచ్చయ్య, పాసిన్ని నాగేశ్వరరావు, షేక్ బందేలు, రాయమల్లు, ముక్కా సీతారాములు, మహమ్మద్, పాషా తదితరులు పాల్గొన్నారు.