సూర్యుడి అరుదైన చిత్రాలు విడుదల.
• తొలిసారి ప్లాస్మా సుడిగుండాల స్పష్టమైన దృశ్యాలు.
హైదరాబాద్, మహా.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సౌర టెలిస్కోప్ డానియెల్ కె. ఇనోయే సాయంతో శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలను విడుదల చేశారు. ఈ చిత్రాల్లో సూర్యుడిపై ఏర్పడే సూక్ష్మస్థాయి ప్లాస్మా సుడిగుండాలు (వోర్టెక్స్‌లు) తొలిసారిగా స్పష్టంగా నమోదయ్యాయి. కెల్విన్-హెల్మ్‌హోల్ట్జ్ అస్థిరతలు గా పిలిచే ఈ దృశ్యాలు సౌర పరిశోధనలో కీలక మైలురాయిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
వేగంగా కదిలే వేడి ప్లాస్మా, నెమ్మదిగా కదిలే ప్లాస్మాతో ఢీకొన్నప్పుడు ఈ తరహా అలలు, సుడిగుండాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా సిద్ధాంతపరంగా వివరించినప్పటికీ, సూర్యుడి ఉపరితలంపై ఇంత స్పష్టంగా వీటిని పరిశీలించడం ఇదే తొలిసారి. ఈ పరిశోధన ద్వారా సూర్యుడిలో అయస్కాంత శక్తి ఎలా పేరుకుపోతుంది, ఎలా విడుదలవుతుంది అనే అంశాలపై మరింత స్పష్టత లభించనుంది.
సౌర జ్వాలలు (సోలార్ ఫ్లేర్స్), కరోనా మాస్ ఎజెక్షన్లు (సీఎంఈలు) వంటి శక్తివంతమైన ఘటనలు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకోవడంలో ఈ చిత్రాలు కీలకంగా ఉపయోగపడనున్నాయి. అంతేకాదు, భూమిపై ఉపగ్రహాలు, జీపీఎస్ వ్యవస్థలు, రేడియో కమ్యూనికేషన్, విద్యుత్ గ్రిడ్‌లపై ప్రభావం చూపే సౌర తుఫాన్లను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








