- అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఎంఐటీలో
- హంఫ్రీ ఫెలోషిప్‌కు తెలంగాణ బిడ్డ ఐఏఎస్ కీర్తి జల్లి ఎంపిక
హైదరాబాద్, మహా : తెలంగాణకు చెందిన ప్రతిభావంతురాలు, అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్రీమతి కీర్తి జల్లి అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేంబ్రిడ్జ్ లో నిర్వహించే అత్యంత ప్రతిష్ఠాత్మక హ్యూబర్ట్ హెచ్. హంఫ్రీ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కు ఎంపిక కావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. 2026 ఆగస్టు నుంచి 10 నెలల పాటు కొనసాగే ఈ అంతర్జాతీయ ఫెలోషిప్‌లో ఆమె టెక్నాలజీ పాలసీ అండ్ మేనేజ్మెంట్ అంశంలో ఉన్నత స్థాయి అధ్యయనం, పరిశోధన మరియు విధానపరమైన శిక్షణ పొందనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మధ్యస్థాయి ప్రజాపాలన నాయకులను తీర్చిదిద్దే అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో హంఫ్రీ ఫెలోషిప్ ఒకటిగా గుర్తింపు పొందింది.
వరంగల్ జిల్లాలోని తరిగొప్పుల కు చెందిన కీర్తి జల్లి హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి, కృషి, పట్టుదలతో అత్యున్నత సివిల్ సర్వీసులో స్థానం సంపాదించారు. ఆమె రైతు కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి తెలంగాణ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా సేవలందిస్తుండగా, తల్లి గృహిణి.bప్రస్తుతం ఆమె అస్సాం ప్రభుత్వంలో పంచాయతీ & గ్రామీణాభివృద్ధి కమిషనర్ గా, అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) మిషన్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత 13 సంవత్సరాలుగా ప్రజారోగ్యం, మహిళా సాధికారత, పోషకాహారం, గ్రామీణాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన, పారిశుద్ధ్యం వంటి కీలక రంగాల్లో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల ప్రశంసలు పొందారు. వరదల సమయంలో సహాయక చర్యలు, కోవిడ్-19 నిర్వహణలో ఆమె చూపిన నాయకత్వానికి అస్సాం ముఖ్యమంత్రి ‘కర్మశ్రీ అవార్డు’తో సత్కరించారు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పట్టభద్రురాలైన కీర్తి జల్లి, ప్రభుత్వ సేవలలో సాంకేతికత వినియోగం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఆధారిత పరిపాలన ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే విధానాలపై ఈ ఫెలోషిప్‌లో ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నారు. గ్రామీణ, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే తన అధ్యయన ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత ఎంఐటీలో అధ్యయనం చేసేందుకు ఎంపిక కావడం ద్వారా కీర్తి జల్లి తెలంగాణ యువతకు ఆదర్శంగా నిలిచారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగి, అంతర్జాతీయ వేదికపై భారతదేశం, తెలంగాణ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేయడం విశేషంగా ప్రశంసించబడుతోంది. ఆమె ఈ అరుదైన విజయంపై న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ నుంచి ప్రపంచస్థాయి నాయకత్వాన్ని అందించే యువ అధికారులకు కీర్తి జల్లి ప్రేరణగా నిలుస్తారని వారు అభిప్రాయపడ్డారు.








