• భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే దందా.
• బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకే: బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపణ
హైదరాబాద్, మహా.
తెలంగాణలో భూములను నిషేధిత జాబితాలో చేర్చే వ్యవహారంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉద్దేశపూర్వకంగా భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు. ఆ తర్వాత సీఎం లేదా ఆయనకు సంబంధించిన వ్యక్తుల నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతే ఆయా భూములను జాబితా నుంచి తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం నేరుగా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
భూముల విలువ అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా వ్యవహారం ఎక్కువగా జరుగుతోందని ఈటల రాజేందర్ అన్నారు. విలువైన భూములను నిషేధిత జాబితాలో చేర్చి, వాటి యజమానులను కార్యాలయాల చుట్టూ తిప్పడం వెనుక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో భాగంగానే ఈ విధానం కొనసాగుతోందని విమర్శించారు.
భూమి నిషేధిత జాబితాలో చేరడంతో యజమానులు తమ ఆస్తులను విక్రయించుకోవడం, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం బాధితులు కాళ్లు అరిగేలా కలెక్టర్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఒకసారి భూమిని నిషేధిత జాబితాలో చేర్చిన తర్వాత దానిని తొలగించుకునేందుకు సామాన్య ప్రజలు పడుతున్న అవస్థలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ప్రభుత్వ యంత్రాంగంలోని కొంతమంది అధికారులను అడ్డుపెట్టుకుని భూముల విషయంలో వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తున్నారని ఈటల ఆరోపించారు. ముందుగా భూమిని నిషేధిత జాబితాలో చేర్చి, ఆ తర్వాత అధికారిక అనుమతులు లేదా ఉన్నతస్థాయి స్పష్టత పేరుతో సమస్యను పరిష్కరించే విధానం కొనసాగుతోందని అన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు, భూ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
భూముల విలువ పెరిగిన ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో భూములను చేర్చే ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడంతోపాటు, బాధితులు నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి ముగింపు పలకాలని కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు, భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, అనంతరం వాటిని క్లియర్ చేయడం వంటి అంశాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు తెలంగాణలో భూముల నిషేధిత జాబితా వ్యవహారాన్ని మరోసారి రాజకీయ చర్చలోకి తెచ్చాయి. ప్రభుత్వ అధికారులు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నారని అధికార పక్షం స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడగా, ఈ ఆరోపణలపై ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.








