Mahaa Daily Exclusive

  పాతబస్తీపై కాంగ్రెస్‌ది ఓటుబ్యాంకు రాజకీయం..! తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు..

Share

  •  విద్యుత్‌ బిల్లులు చెల్లించని వారిపై సానుభూతి ఎందుకు?.
  •  పేద హిందువుల ఇళ్లపై హైడ్రా చర్యలు తీసుకుంటూ మైనారిటీల విషయంలో మినహాయింపులా?
  •  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు.

హైదరాబాద్‌,మహా.

పాతబస్తీలో విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం అమలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. విద్యుత్‌ బిల్లులు చెల్లించని వారికి సైతం సానుభూతి చూపుతూ మాట్లాడటం సరికాదని సోషల్‌ మీడియా వేదికగా విమర్శించారు.
పాతబస్తీలోని కొంతమంది మైనారిటీలు విద్యుత్‌ బిల్లులు చెల్లించడం లేదని, అందుకే వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించామన్న రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని రాంచందర్‌రావు అన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు నిర్దిష్ట నిబంధనలు, అర్హతలు ఉంటాయని, వాటిని అందరికీ సమానంగా వర్తింపజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పేద హిందూ కుటుంబాల ఇళ్లపై హైడ్రా చర్యలు తీసుకుంటున్నప్పుడు చూపని సానుభూతిని విద్యుత్‌ బిల్లులు చెల్లించని మైనారిటీల విషయంలో ఎందుకు చూపిస్తున్నారని రాంచందర్‌రావు ప్రశ్నించారు. చట్టం, ప్రభుత్వ నిబంధనలు అందరికీ ఒకే విధంగా అమలు కావాలని డిమాండ్‌ చేశారు.
ఒకవైపు పేద, సామాన్య కుటుంబాలపై హైడ్రా చర్యలు తీసుకుంటూ మరోవైపు మైనారిటీల విషయంలో విద్యుత్‌ బిల్లుల అంశాన్ని భిన్నంగా చూడటం వివక్షకు దారితీస్తుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేసినా మతం, ప్రాంతం ఆధారంగా కాకుండా అర్హత ఆధారంగా అందరికీ సమానంగా వర్తింపజేయాలని సూచించారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని రాంచందర్‌రావు మండిపడ్డారు. హిందువుల ప్రయోజనాలను పణంగా పెట్టి మైనారిటీలను ఆకర్షించే రాజకీయాలు కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదని విమర్శించారు. ఖిలాఫత్‌ ఉద్యమం నాటి నుంచి కాంగ్రెస్‌ విధానంలో పెద్దగా మార్పు కనిపించడం లేదంటూ ఆయన రాజకీయ విమర్శలు చేశారు.
ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్షకు తావులేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికీ ప్రయోజనం అందించాల్సిన అవసరం ఉందని రాంచందర్‌రావు అన్నారు. పాతబస్తీలో విద్యుత్‌ బిల్లుల బకాయిలు, ఉచిత విద్యుత్‌ పథకం అమలు, అర్హతలపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

Latest