• బ్యాంకు అధికారినంటూ ఫోన్.
• కుటుంబ సభ్యులను 6-7 గంటలు డిజిటల్ అరెస్ట్ చేశారు.
• ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున.
హైదరాబాద్, మహా:
సైబర్ నేరాలకు సెలబ్రిటీలు సైతం అతీతులు కాదని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. తాను కూడా సైబర్ మోసానికి బాధితుడినేనని వెల్లడించారు. ఐదేళ్ల క్రితం బ్యాంకు అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి పెట్టుబడి పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు. అంతేకాకుండా తన కుటుంబంలోని కొందరిని సైబర్ నేరగాళ్లు మాయమాటలతో సుమారు 6-7 గంటలపాటు ‘డిజిటల్ అరెస్ట్’ చేసిన ఘటనను గుర్తుచేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సురక్ష కా తిరంగా’ సైబర్ అవగాహన కార్యక్రమంలో నాగార్జున పాల్గొన్నారు.
బ్యాంకు అధికారినంటూ తనకు ఫోన్ చేసిన సైబర్ నేరగాడు పెట్టుబడులకు సంబంధించిన మంచి అవకాశాలు ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేశాడని నాగార్జున తెలిపారు. సాధారణంగా తన ఆర్థిక వ్యవహారాలను మేనేజర్ చూసుకుంటారని, అయితే నేరుగా తనకు ఫోన్ రావడంతో మొదట ఆ కాల్‌ను నిజమైనదిగానే భావించానని చెప్పారు. సైబర్ మోసగాళ్లు ఎంత తెలివిగా, నమ్మదగిన రీతిలో మాట్లాడుతున్నారో తన అనుభవం ద్వారా అర్థమైందన్నారు.
తన కుటుంబ సభ్యులను కూడా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారని నాగార్జున తెలిపారు. విదేశాలకు నార్కోటిక్ పదార్థాలతో కూడిన పార్సిల్ పంపారంటూ బెదిరింపు కాల్స్ చేశారని, ఆ తరువాత మాయమాటలతో కుటుంబ సభ్యులను గంటల తరబడి భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు. ఇలాంటి మోసాలను గుర్తించే అవగాహన తనకు ఉండటంతో అప్రమత్తంగా వ్యవహరించగలిగానని వివరించారు.
సైబర్ భద్రత విషయంలో తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటానని నాగార్జున చెప్పారు. తన మొబైల్ పాస్‌వర్డ్‌ను వారానికి ఒకసారి, వైఫై పాస్‌వర్డ్‌ను నెలకోసారి మారుస్తానని తెలిపారు. తన ఫోన్లో ఫొటోలను కూడా నిల్వ చేయనని చెప్పారు. వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్లో ఎక్కువగా ఉంచకుండా ఉండటం, పాస్‌వర్డ్‌లను తరచూ మార్చడం, గుర్తుతెలియని లింకులు, కాల్స్‌కు స్పందించకుండా ఉండటం వంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషిని నాగార్జున ప్రశంసించారు. సైబర్ నేరాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన కల్పించడంలో తెలంగాణ సైబర్ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారని కొనియాడారు. సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టడంలో డీజీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన కృషి అభినందనీయమన్నారు. తెలంగాణ పోలీసుల చర్యలతో తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు భారతీయ సినీ పరిశ్రమకు కూడా ప్రయోజనం కలిగిందని చెప్పారు.
తాను ఇంజినీరింగ్ చదువుతున్న 1977లోనే కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయని నాగార్జున గుర్తుచేశారు. అప్పట్లోనే మాల్వేర్, హ్యాకింగ్ వంటి అంశాలపై ప్రొఫెసర్లు హెచ్చరించేవారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు సైబర్ నేరాల సమస్య కొనసాగుతూనే ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ నేరగాళ్లు కూడా కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని, అందుకే ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా బాధితులు
సైబర్ నేరాల స్వరూపం వేగంగా మారుతోందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఒకప్పుడు భౌతిక దోపిడీలు ఎక్కువగా జరిగేవని, ప్రస్తుతం నార్కోటిక్, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. సైబర్ మోసాలకు గురవుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్నారని చెప్పారు.
‘సురక్ష కా తిరంగా’ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లను భాగస్వాములను చేసి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు. మోసాలకు గురైనప్పటికీ సమాజం ఏమనుకుంటుందోననే భయంతో చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారని అన్నారు. సైబర్ నేరానికి గురైన వెంటనే విషయాన్ని దాచిపెట్టకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇప్పటివరకు సుమారు 40 రకాల సైబర్ మోసాలను గుర్తించినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. వీటిలో ఇటీవల పెట్టుబడుల పేరుతో జరిగే ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్’ గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రజల నుంచి భారీగా డబ్బులు దోచుకుంటున్నారని, సైబర్ నేరగాళ్లు పోలీసులు, బ్యాంకు అధికారులు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులుగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు.
సైబర్ నేరగాళ్లు నిరంతరం తమ పద్ధతులను మార్చుకుంటూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని డీజీపీ తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచడం, బాధితులు వెంటనే ఫిర్యాదు చేయడం, అనుమానాస్పద కాల్స్, లింకులు, పెట్టుబడి ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండటం ద్వారానే ఈ నేరాలను గణనీయంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు. నార్కోటిక్ నేరాల బారిన పడుతున్న విద్యార్థులు, యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.








