Mahaa Daily Exclusive

  కాంగ్రెస్‌లోనే ఉంటా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తా..! తన వ్యాఖ్యల దుమారంతో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి క్లారిటీ..

Share

హైదరాబాద్, మహా : తాను చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర కాంగ్రెస్ లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా తన వైఖరిపై స్పష్టత ఇచ్చారు. ఇక అదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని, అందుకే విమర్శలు గుప్పిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని.. అగ్రనేత రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని తేల్చిచెప్పారు. తనకు పార్టీని వీడే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలపై తన అభిప్రాయాలను మాత్రమే వెల్లడిస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నాయకులను తాను విమర్శించలేదని.. ఇకపై కూడా వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించనని చెప్పారు. అయితే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొందరి ఆధిపత్యం పెరగడం వల్ల పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన ఆవేదనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రజా పాలనలో ఉద్యమకారులు, పాత కాంగ్రెస్‌ నాయకులు, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించాలని ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయంగా అవకాశాల కోసం పార్టీలోకి వచ్చినవారు అసలైన కార్యకర్తలకు అన్యాయం చేయకుండా ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వెనుక ప్రజల ఆత్మగౌరవం ప్రధాన కారణమని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ ఇతరుల ప్రభావంతో కాకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్రంగా చేసుకుని పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అంటే పేదలు, సామాన్యుల అవసరాలను తీర్చేలా ఉండాలని.. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే పరిమితం కాకూడదని వ్యాఖ్యానించారు. తెలంగాణను ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్ర భవిష్యత్తులోనూ కాంగ్రెస్‌ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు.

Latest