- కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించాలి
- విద్యాలయ అబివృద్ధి పనులకు ప్రతిపాధనలు పంపాలి
- ఏకలవ్య మోడల్ స్కూల్ ను అకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
కారేపల్లి, మహ:విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు అందుకునేలా అవసరమైన నైపుణ్యాలను పెంపొందించటానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ సూచించారు. మంగళవారం సింగరేణి మండలం రేలకాయలపల్లిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల ప్రవేశాలు, విద్యా ఫలితాలు, వారికి అందుతున్న భోజనం, వసతులు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లోకి వెళ్లి బోధనా తీరును పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల ఆసక్తి, భవిష్యత్ లక్ష్యాలు, ఉన్నత విద్యలో ఎంచుకునే కోర్సులగురించి చర్చించారు. లైబ్రరీ, మ్యూజిక్ రూమ్, ఆర్ట్స్ గ్యాలరీ, సైన్స్ ల్యాబ్ లను కలెక్టర్ పరిశీలించారు. సైన్స్ ల్యాబ్‌లో విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్కరణలను తిలకించి విద్యార్ధులను అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. పోటీ ప్రపంచంలో కేవలం విద్యార్హతలే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతిక పరిజ్ఞానం, సమస్య పరిష్కార సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు వంటి నైపుణ్యాలు ఎంతో అవసరమన్నారు.
విద్యాలయ అబివృద్ధి పనులకు ప్రతిపాధనలు పంపాలి
ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, అధికారులు, విద్యాలయ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు ఖమ్మం– చీమలపాడు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని, పాఠశాల భవనం ప్రహరీ గోడపై సోలార్ విద్యుత్ కంచె ఏర్పాటు చేయాలని, పాఠశాల ప్రాంగణంలో అదనపు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, విద్యా సామగ్రి, ప్రయోగశాలలు, లైబ్రరీ, క్రీడా సదుపాయాలు, విద్యుత్, తాగునీరు తదితర వసతులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నాణ్యమైన ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సుమారు 9.57 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన జరుగుతుండగా, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్, తన్నీరు నాగేశ్వరరావు,ఆర్ఐ జగదీశ్, గ్రామ సర్పంచ్ తేజావత్ శిరీష, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








